అందాల లోయ జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో దాదాపు 300 మంది ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో.. భారీగా బలగాలను మోహరించారు. పలు ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లోనే ఉన్నాయి.
శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో నిషేధాజ్ఞలను సడలించాలని చూస్తున్నా.. ఇదే అదనుగా ఉగ్రమూకలు రెచ్చిపోయే ప్రమాదముందని భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. వచ్చే వారం బక్రీద్ సందర్భంగా.. ఆంక్షలు పరిమితం చేయకుంటే తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావిస్తున్నారు అధికారులు. సడలిస్తే పరిస్థితిని అదుపు చెయ్యడం కష్టమేననే భావన వారిలో వ్యక్తమవుతోంది.
కొనసాగుతున్న అరెస్టులు...
కశ్మీర్లో సమస్యలు సృష్టిస్తారనుకునే వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఈ సంఖ్య వందల్లోనే ఉంది. కొన్ని చోట్ల అధికరణ 370 రద్దుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వారిని అరెస్టు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో చరవాణులు పనిచేయట్లేదు. సమాచార వ్యవస్థ పూర్తిగా నిలిపివేశారు. ప్రజా రవాణా స్తంభించింది. ప్రైవేటు వాహనాలనూ ఎక్కువగా రోడ్లపైకి అనుమతించట్లేదు.
శాంతి భద్రతలపై మాలిక్ సమీక్ష
ఆర్టికల్ 370 రద్దు అనంతరం.. జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు ప్రాథమిక సదుపాయాలు అందుతున్నాయో లేదో అని ఆరా తీశారు. ప్రజల కోసం శుక్రవారం ప్రార్థనల ఏర్పాట్లపై.. గవర్నర్ సలహాదారులు విజయ్ కుమార్, స్కందన్, ముఖ్య సలహాదారు సుబ్రమణ్యంలతో సమీక్ష నిర్వహించారు.
ప్రజల సమస్యలు పరిష్కరించండి...
కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో... ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్. ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ ప్రజలను వేధింపులకు గురి చేయరాదని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. దేశం కోసం తమ కర్తవ్యం నిర్వర్తించడంలో ధైర్యసాహసాలను ప్రదర్శించాలని అక్కడి పోలీసు, పారామిలటరీ బలగాలతో సంభాషించారు.
ఇదీ చూడండి: కశ్మీర్‌లోని ఆడవారిని పెళ్లి చేసుకోండి: భాజపా ఎమ్మెల్యే
రాజ్‌నాథ్‌కు రావత్ వివరణ...
జమ్ముకశ్మీర్‌తో పాటు భారత్-పాకిస్థాన్ సరిహద్దు వెంబడి భద్రతా పరిస్థితుల్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు సైన్యాధిపతి బిపిన్ రావత్. అధికరణ 370 రద్దు నేపథ్యంలో దాయాది పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తిప్పికొట్టేందుకు నియంత్రణ రేఖ వెంట అత్యంత అప్రమత్తంగా ఉంది భారత సైన్యం.
''జమ్ముకశ్మీర్ సహా భారత్-పాక్ సరిహద్దు వెంట తాజా పరిణామాలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సైన్యాధిపతి బిపిన్ రావత్ వివరణ ఇచ్చారు. పరిస్థితులు మొత్తం నియంత్రణలోనే ఉన్నాయి. రాష్ట్రంలో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.''
-రక్షణ మంత్రి కార్యాలయం ట్వీట్