రోడ్డుపై ప్రసవవేదనతో బాధపడుతున్న ఓ మహిళకు పురుడుపోసి మానవత్వం చాటుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ ఏంటి? ప్రసవం చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవాల్సిందే.
ఇదీ జరిగింది...
ఒడిశాకు చెందిన 26 ఏళ్ల మహిళ కోయంబత్తూర్లోని ఓ విద్యాసంస్థలో పనిచేస్తోంది. మైనీస్ థియేటర్ సమీపంలో.. సదరు మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ కనిపించింది. అయితే అదే సమయంలో ఆమె బాధను గమనించిన ఆటో డ్రైవర్, నవలా రచయిత ఎం.చంద్రకుమార్ (ఆటో చంద్రన్‌గా సుపరిచితం) ఆయనకు ఇదివరకు ఉన్న అనుభవంతో ఆమెకు రోడ్డుపైనే ప్రసవం చేశాడు.
"నా జీవితంలో కొన్నిసార్లు ప్రసవాలు చూశాను. 90వ దశాబ్దంలో.. నా ఆటోలో ఓ మహిళ ప్రసవం చూశాను. ఈ విషయంపై 2013లో 'అజాగు' అనే చిన్న కథ కూడా రాశాను. అందుకే ఈ మహిళకు సహాయం చేసేందుకు ముందుకొచ్చాను. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆమెకు పాతకాలం పద్ధతిలో పురుడు పోశాను. శిశువును నా చేతిలోకి తీసుకుని తలకిందులుగా పట్టుకున్నాను. ఆ శిశవును ఏడిపించేందుకు అలా పట్టుకున్నాను." - ఆటో చంద్రన్
ఆ మహిళ పురిటినొప్పులతో బాధపడుతున్నప్పుడు అక్కడ పలువురు మహిళలు ఉన్నా చూస్తూ ఉండిపోయారు. మరికొందరైతే తమ ఫోన్లలో వీడియోలు కూడా తీసుకున్నారు. కానీ చంద్రన్ మాత్రం సమయం వృథా చేయకుండా ఆ మహిళకు సహాయం చేశారు.
ఆ మహిళకు సహాయం చేస్తున్నప్పుడు కొందరు వీడియో తీశారు. ఇప్పుడా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
చంద్రన్ రాసిన 'లాక్అప్' అనే నవల ఆధారంగా విసరణై అనే తమిళ చిత్రం రూపుదిద్దుకుంది.
ఇదీ చూడండి:'అనుమానాల్లేవ్... కరోనాపై విజయం తథ్యం'