విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం సర్వం సిద్ధం చేసింది. 'వందేభారత్' మిషన్ ద్వారా 12 దేశాల్లో ఈ ఆపరేషన్ చేపట్టనుంది. ఇవాళ్టి నుంచి మే 13 వరకు 15 వేల మందిని భారత్‌కు తరలించనున్నారు. ఇందుకోసం 64 విమానాలతో పాటు నౌకలను వినియోగించనుంది కేంద్రం.
ఈ ఆపరేషన్ ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద తరలింపుగా నిలిచిపోనుంది. ఈ మిషన్‌లో పౌర విమానయాన శాఖ, నౌకాయాన డైరెక్టరేట్ జనరల్, ఆరోగ్యశాఖ, భారత వైమానిక దళం, నౌకాదళం, విదేశాంగ శాఖ పాలుపంచుకోనున్నాయి.
ఈ ఆపరేషన్‌కు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ.
నిబంధనలివే..
- ఎవరి ప్రయాణ ఖర్చులు వారే భరించాలి.
- వీసా గడువు ముగిసిన వారు, ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఉన్నవారు, జీవానోపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న కార్మికులకే తొలి ప్రాధాన్యం ఉంటుంది.
- బోర్డింగ్‌కు ముందు అందరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. వైరస్ లక్షణాలు లేకుంటేనే అనుమతి ఉంటుంది.
- ప్రయాణికులందరూ తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
- మాస్క్‌లు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
- స్వదేశం చేరుకున్నాక సొంత ప్రాంతాలకు చేరుకునే ఏర్పాట్లు ఆయా రాష్ట్రాలే చూసుకోవాలి.
- ప్రయాణికులకు వైద్య పరీక్షలు, క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.
- స్వదేశం వచ్చాక తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్ కేంద్రంలో ఉండాలి.
- ఆ తర్వాత వైద్య పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే ఇళ్లకు పంపాలి. కొద్దిరోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలి.
ఆ 12 దేశాలివే..
యూఏఈ, యూకే, అమెరికా, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, మలేసియా, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, కువైట్, ఒమన్.
సర్వీసులు ఇలా..
యూఏఈ నుంచి 10, అమెరికా, యూకే నుంచి చెరో ఏడు చొప్పున విమానాలను నడపనుంది కేంద్రం. సౌదీ అరేబియా, సింగపూర్ నుంచి చెరో 5, ఖతార్ నుంచి రెండు విమానాలు నడపనుందని ఓ అధికారి వెల్లడించారు.
వీటితో పాటు మలేసియా, బంగ్లాదేశ్ నుంచి చెరో 7, కువైట్, ఫిలిప్పీన్స్ నుంచి చెరో 5 చొప్పున, ఒమన్, బహ్రెయిన్ నుంచి రెండేసి చొప్పున విమానాలు నడిపే అవకాశం ఉంది.
మొత్తం 64 విమానాల్లో కేరళ నుంచి 15, దిల్లీ, తమిళనాడు నుంచి చెరో 11, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి చెరో 7, మిగతా రాష్ట్రాల నుంచి 5 చొప్పున విమానాలు నడుస్తాయని ఆయన వివరించారు. ఈ వారం రోజుల్లో 14,800 మంది భారతీయులు స్వదేశానికి చేరుకుంటారని.. మిగతా వారిని తీసుకొచ్చేందుకు మే 13 తర్వాత కేంద్రం మరిన్ని విమానాలను నడుపుతుందని మరో అధికారి తెలిపారు.
కొన్ని సర్వీసులు వాయిదా..
అయితే గురువారం బయల్దేరాల్సిన కొన్ని ఎయిర్ఇండియా విమానాలు ఆలస్యం కానున్నాయి. విమాన సిబ్బందికి కరోనా నిర్ధరణ పరీక్షలు సమయానికి జరగని కారణంగా కొన్ని సర్వీసులు శుక్రవారానికి వాయిదా వేశారు.
ఆపరేషన్ సముద్ర సేతు..
సముద్ర మార్గం ద్వారా కూడా విదేశీయులను స్వదేశం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేసింది భారత నావికాదళం. ఆపరేషన్ 'సముద్ర సేతు' కోసం జలశ్వా, మగర్ ఓడలు మాల్దీవుల నౌకాశ్రయానికి బయలు దేరాయి. ఫేస్-1లో భాగంగా రేపటి నుంచి తరలింపు కార్యక్రమం చేపట్టనుంది.