భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలపై అమెరికాలో వేసిన ఓ దావాను అక్కడి కోర్టు కొట్టివేసింది. కశ్మీర్ ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థ, మరో ఇద్దరు కలిసి 100మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలంటూ అమెరికా కోర్టులో దావా వేశారు. దావా వేసినప్పటికీ రెండు సార్లు ఏర్పాటుచేసిన విచారణకు హాజరు కాకపోవడం వల్ల అమెరికా కోర్టు చివరకు దావాను కొట్టివేసింది.
జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హక్కులను రద్దుచేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని వేర్పాటువాదులు అమెరికా కోర్టులో సవాలు చేశారు. ఇందుకోసం ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ కన్వాల్‌జీత్ సింగ్ ధిలోన్‌ల నుంచి 100మిలియన్ డాలర్లు నష్టపరిహారం ఇప్పించాలని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. 'దావా మాత్రమే వేసిన 'కశ్మీర్ ఖలిస్థాన్ రెఫరెండం ఫ్రంట్', తర్వాత విచారణకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అంతేకాకుండా రెండు దఫాల్లో ఏర్పాటుచేసిన సమావేశానికి కూడా హాజరు కావడంలో విఫలమయ్యింది' ఈ కారణంగా కేసును కొట్టివేయాలని టెక్సాస్ సదరన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి ఫ్రాన్సిస్ హెచ్ స్టాసీ అక్టోబర్ 6వతేదీన సిఫార్సు చేశారు. రెండు వారాల అనంతరం అక్టోబర్ 22న టెక్సాస్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు దీన్ని కొట్టివేంది.
ఆ ఇద్దరు ఎవరో కూడా తెలియదు..
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగిస్తూ గత ఏడాది భారత పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాలు చేస్తూ కశ్మీర్ ఖలిస్థాన్ రెఫరెండం ఫ్రంట్‌తో పాటు మరో రెండు పేర్లతో ఫిర్యాదు చేసినప్పటికీ వారి వివరాలు మాత్రం పేర్కొనలేదు. కేవలం వారి పేర్లను TFK, SMS లుగానే దావాలో పేర్కొన్నారు. అయితే, ఈ దావాను పన్నున్ అనే న్యాయవాది కోర్టులో వేయగా అనంతరం దీనిపై ఎలాంటి సంప్రదింపులకు ముందుకు రాలేదు.
కోర్టు రికార్డుల ప్రకారం, హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్‌లో.. 2020 ఫిబ్రవరి 20న సమన్లు అందించినట్లు తెలిసింది. అనంతరం విచారణ కోసం ఆగస్టు 2న తొలి సమావేశం, అక్టోబర్ 6న రెండో సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ఫిర్యాదు దారులు విచారణకు హాజరు కాలేదు. దీనితో ఈ దావాను కొట్టివేయాలని అమెరికా కోర్టు నిర్ణయం తీసుకుంది.
ఇదిలాఉంటే, నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా హ్యూస్టన్‌లో ఏర్పాటుచేసిన హౌడీ-మోదీ కార్యక్రమం జరిగే కొన్నిరోజుల ముందే దీన్ని అక్కడి కోర్టులో దాఖలు చేశారు. 2019 సెప్టెంబర్ 22న జరిగిన ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దాదాపు 50వేల మంది భారత సంతతి ప్రజలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:18న షా సమక్షంలో కమలం గూటికి సువేందు!