మధ్యప్రదేశ్ సత్నా జిల్లా సజ్జన్‌పుర్‌లో దొంగలు ఏకంగా ఒక ప్రైవేటు సంస్థ ఏటీఎంనే ఎత్తుకెళ్లిపోయారు. రాంపుర్ బాగెలాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న ఏటీఎంను అర్ధరాత్రి దొంగలు అపహరించారు.
ఈ ఏటీఎం వద్ద సెక్యూరిటీ లేని కారణంగా వారి పని సులువైంది. ఉదయం ఏటీఎం లేకపోవడం గమనించిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఏటీఎం నిర్వాహకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏటీఎంలో రూ.లక్షన్నర నుంచి రెండు లక్షల వరకూ నగదు ఉన్నట్లు చెప్పారు.
ఏటీఎంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తేలింది. రాజస్థాన్, హరియాణా నుంచి వచ్చిన ముఠానే ఈ దొంగతనం చేసి ఉంటుందని సత్నా అదనపు ఎస్పీ గౌతమ్ సోలంకి తెలిపారు.