భాజపా నేత కుటుంబంపై ముష్కరుల దాడి
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఉత్తర కశ్మీర్‌లోని బందిపొరాలో బుధవారం రాత్రి జిల్లా భాజపా మాజీ అధ్యక్షుడు వసీమ్‌బరి కుటుంబంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వసీంబరితోపాటు అతని తండ్రి,సోదరుడు ప్రాణాలు కోల్పోయారు.
వసీమ్ బరీ నివాసం వద్ద దుండుగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మోటార్ సైకిల్ మీద వచ్చిన ముష్కరులు అతి దగ్గర నుంచి సైలెన్సర్ అమర్చిన తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వసీమ్‌బరి అక్కడికక్కడే మరణించారు. ఆయన తండ్రి, సోదరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం!
పోలీస్‌స్టేషన్‌కు పదిమీటర్ల దూరంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు ఘటనకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఏడుగురు పోలీసులను అధికారులు అరెస్ట్ చేశారు.
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సహా పలు పార్టీల నాయకులు దాడిని తీవ్రంగా ఖండించారు. వసీమ్ బరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ ఆరా తీశారు.