కాంగ్రెస్ పార్టీలో ‘పెద్దల’ మాటే చెల్లుబాటు అవుతున్నందున ఆ పార్టీలోని కొందరు యువ నాయకుల్లో అంతర్లీనంగా అసంతృప్తి గూడుకట్టుకుంటోంది. మధ్యప్రదేశ్‌లో యువనాయకుడు జ్యోతిరాదిత్య సింధియాకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా సీనియర్ నేత కమల్‌నాథ్‌కు పట్టం కట్టడం వల్లనే ఆయన కాంగ్రెస్‌ను వీడే పరిస్థితి ఏర్పడింది. మధ్యప్రదేశ్ శాసనసభకు 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సింధియా కీలక భూమికే పోషించారు. అయితే ముఖ్యమంత్రి పదవి మాత్రం సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌నే వరించింది. కనీసం పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఆయనకు దక్కకపోగా మధ్యప్రదేశ్ రాజకీయాల నుంచి ఆయనను పక్కకు పంపే ప్రయత్నాలు జరిగాయి. ఈ కారణాలతోనే సింధియా అసంతృప్తి వ్యక్తం చేశారు.
సచిన్‌పైలట్‌కు దక్కని ప్రాధాన్యం
దాదాపుగా ఇలాంటి పరిస్థితులే రాజస్థాన్‌లోనూ కనిపిస్తున్నాయి. అక్కడ యువనేత సచిన్ పైలట్‌కు తగిన ప్రాధాన్యం లభించడం లేదనే మాట వినిపిస్తోంది. రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి 2018లో ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు సచిన్‌పైలట్ తీవ్రంగానే కృషి చేశారు. అయితే ముఖ్యమంత్రి పదవి మాత్రం సీనియర్ నాయకుడైన అశోక్ గహ్లోత్‌కు దక్కింది. సచిన్‌పైలట్‌ను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించినా ఆయనకు రాష్ట్రంలో ఎక్కడా ప్రాధాన్యం లభించలేదు. సచిన్ కూడా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తనయుడు వైభవ్ గహ్లోత్ ఓటమి సహా ఆ ఎన్నికల్లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ పరాజయానికి సచిన్‌పైలట్ సహాయనిరాకరణే కారణమని భావిస్తుంటారు. ఇప్పుడు సింధియా తన దారి తాను చూసుకున్న నేపథ్యంలో సచిన్ పైలట్ ఇదే బాటపడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
మరికొందరికి సింధియా కొత్త మార్గం
మరికొన్ని రాష్ట్రాల్లో కూడా అసంతృప్తిగా ఉన్న నాయకులు వేరే పార్టీలవైపు చూడవచ్చన్న చర్చ కూడా ప్రారంభమైంది. రాహుల్‌గాంధీ టీమ్‌ను పక్కన పెడుతున్నారని ఆరోపిస్తూ తాను పార్టీ నుంచి వైదొలుగుతానని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ పార్టీకి హెచ్చరికలు పంపిన విషయం తెలిసిందే. మరో నాయకుడు మిలింద్ దేవ్‌రా కూడా అసంతృప్తిగానే ఉన్నారు. పంజాబ్‌లో నవ్‌జోత్‌సింగ్ సిద్ధూకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో పొసగడం లేదు. ఇలాంటి వారికి సింధియా రాజీనామా కొత్త మార్గాన్ని చూపుతుందనే విశ్లేషణలు సాగుతున్నాయి.
హరియాణా కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయి మాట్లాడుతూ సింధియా నిష్క్రమణ కాంగ్రెస్‌కు పెద్ద శరాఘాతమన్నారు. సింధియాలానే దేశంలో అనేక మంది కాంగ్రెస్ నాయకులు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. తమను పార్టీ పట్టించుకోవడం లేదనే అభిప్రాయంతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం యథావిధిగా సింధియాపై విమర్శల వర్షం కురిపించారు.