ఓ ప్రణాళిక లేకుండా లాక్డౌన్ అమలు చేస్తుండడం వల్ల సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆమె ఈ విధంగా అభిప్రాయపడ్డారు.
"కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 21 రోజుల పాటు లాక్డౌన్ విధించడం అవసరమే. కానీ ఓ ప్రణాళిక లేకుండా దీనిని అమలు చేయడం వల్ల ప్రజలు, ముఖ్యంగా లక్షలాది మంది వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు."- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు
మద్దతిస్తున్నాం.. కానీ
కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల కలుగుతున్న ఇబ్బందులపై కాంగ్రెస్ అగ్రనేతలు చర్చించారు. లాక్డౌన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని సోనియా స్పష్టం చేశారు. కానీ ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ (ఆరోగ్య) సంక్షోభ సమయంలో పేదలకు ఆహారం, నీరు అందించి, అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
"మన దేశంలో కరోనా, లాక్డౌన్ పరిణామాల వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతోంది పేదలు, వెనుకబడి వర్గాలవారే. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారికి అండగా ఉంటూ, చేతనైన సాయం అందించాలి."- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు
వైద్య సిబ్బందిని ఆదుకోండి
కొవిడ్-19ను ఎదుర్కోవడానికి కరోనా పరీక్షలు చేయించుకోవాలని, ప్రజలు బయట తిరగకపోవడమే మంచిందని, దీనికి మరో ప్రత్యామ్నాయం లేదని సోనియా పేర్కొన్నారు. అదే సమయంలో ఆరోగ్య సిబ్బందికి అవసరమైన కిట్లు, మాస్కులు, ఇతర సదుపాయాలు వెంటనే కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
రుణాల సంగతి ఏంటి?
బ్యాంకుల ద్వారా మధ్యతరగతి వారికి కొంత ఉపశమనం లభించినా.. బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలు- వడ్డీలపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోనియా విజ్ఞప్తి చేశారు.
మనసులను కలుపుతోంది
కరోనా మహమ్మారి ఓ వైపు ప్రపంచాన్ని కబళిస్తూ చెప్పలేని బాధలను కలిగిస్తోందని, అదే సమయంలో మానవాళిని ఏకం చేసి సోదర భావాన్ని పెంపొందింపజేస్తోందని సోనియా వ్యాఖ్యానించారు.
ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, కె.సి.వేణుగోపాల్, గులాంనబీ ఆజాద్, చిదంబరం, కెప్టెన్ అమరీందర్ సింగ్ సహా సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'ఆపరేషన్ కరోనా'పై సీఎంలకు మోదీ కీలక సూచనలు