జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)పై అనేక రాష్ట్రాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో ఎన్పీఆర్పై కేంద్రం స్పష్టతనిచ్చింది. ఎన్పీఆర్లో సమాచారాన్ని వెల్లడించే అంశం తప్పనిసరేమీ కాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పౌరులు స్వచ్ఛందంగానే తమ వివరాలు అందించవచ్చని స్పష్టం చేశారు.
ఎన్పీఆర్ ప్రక్రియను 2010లో కాంగ్రెస్ తొలిసారిగా తీసుకొచ్చిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. జాతీయ జనాభా పట్టికను తిరస్కరించే అధికారం రాష్ట్రాలకు లేదని స్పష్టం చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి జనగణనతో పాటే జాతీయ జనాభా పట్టిక ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది.
గోప్యంగానే ఉంటుంది...
మరోవైపు జనాభా లెక్కల సమాచారం గోప్యంగానే ఉంటుందని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. సెన్సస్ చట్టం-1948 ప్రకారం సమాచారానికి పూర్తి భద్రత ఉంటుందని వెల్లడించింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలుంటాయని తెలిపింది.
ఎన్పీఆర్లో భాగస్వామయ్యే ప్రసక్తే లేదని ఇప్పటికే పలు రాష్ట్రాలు తేల్చి చెప్పాయి. ఎన్పీఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు తీర్మానం చేశాయి.
ఇదీ చదవండి: దిల్లీ దంగల్: జేడీయూ,ఎల్జేపీతో కలిసి భాజపా పోటీ