స్వీయ నిర్బంధానికి సంబంధించి మార్గదర్శకాలను సవరించింది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ. తేలికపాటి లక్షణాలు లేదా కరోనా ప్రాథమిక దశలో ఉన్నవారు ఇళ్లలోనే ఐసోలేషన్లో ఉండవచ్చని.. వారికి ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.
ఎవరు ఉండాలి?
గృహ నిర్బంధంలో ఉండే వ్యక్తికి తేలికపాటి లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారి ధ్రువీకరించాలి. స్వీయ నిర్బంధంతో పాటు కుటుంబం క్వారంటైన్లో ఉండేందుకు తగిన సదుపాయాలు ఉండాలి. స్వీయ నిర్బంధంలో ఉంటున్నట్లు అండర్టేకింగ్ ఫారాన్ని సమర్పించాలి.
- 24 గంటలు సంరక్షకుడు అందుబాటులో ఉండాలి. అతను లేదా ఆమె ఆసుపత్రి లేదా వైద్యులతో సంప్రదింపులు జరపాలి.
- సంరక్షుడితో పాటు నిర్బంధంలో ఉన్న వ్యక్తితో సన్నిహితంగా ఉన్నవారు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప్రొఫీలాక్సిస్ మాత్రలను కచ్చితంగా తీసుకోవాలి.
- ఆరోగ్య సేతు యాప్ మొబైల్ ఫోన్లో తప్పనిసరిగా ఉండాలి.
- తన ఆరోగ్య పరిస్థితిపై జిల్లా నిఘా అధికారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి.
వైద్య సహాయం ఎప్పుడు పొందాలి?
- లక్షణాలు తీవ్రమవుతుంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
- శ్వాస తీసుకోవటంలో సమస్యలు, ఛాతీ నొప్పి, మానసిక ఒత్తిడి, అశక్తత, ముఖం, పెదవులు నీలిరంగులోకి మారటాన్ని గుర్తిస్తే వెంటనే స్పందించాలి.
- కనిష్ఠంగా 17 రోజుల తర్వాత స్వీయ నిర్బంధం నుంచి విముక్తి కావచ్చు. 10 రోజులుగా జ్వరం లేకుండా ఉంటే ఎలాంటి నిర్ధరణ పరీక్ష అవసరం లేకుండానే విడుదల అవ్వచ్చు.
సంరక్షకుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- రోగితో ఉన్నప్పుడు మూడు పొరల మెడికల్ మాస్కు ధరించాలి. దానిని ముట్టుకోవద్దు. మాస్కు తడిసిపోతే వెంటనే తొలగించాలి.
- ముఖం, ముక్కు, నోటిని ముట్టుకోవద్దు. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం టవల్ లేదా టిష్యూ పేపర్తో తుడుచుకోవాలి.
- రోగి శరీర ద్రవాలను తాకవద్దు. ముఖ్యంగా నోరు, శ్వాసకోశాల నుంచి వచ్చే బిందువులను మన మీద పడనీయకూడదు.
- రోగికి అతని గదిలోనే భోజన ఏర్పాట్లు చూడాలి. అతను వాడిన పాత్రలను గ్లౌజులు వేసుకుని సబ్బుతో శుభ్రంగా కడగాలి.
- పరిసరాలు శుభ్రం చేసేటప్పుడు, రోగికి దుస్తులు మార్చేటప్పుడు మాస్కుతో పాటు గ్లోవ్స్ కూడా ధరించాలి. వాటిని వేసుకునే మందు, తర్వాత చేతులను శుభ్రంగా కడగాలి.
- రోజువారీగా ఆరోగ్యం, శరీర ఉష్ణోగ్రతను సరిచూసుకోవాలి. ఏదైనా లక్షణాలు బయటపడితే వెంటనే వైద్య సాయం పొందాలి.
రోగి పాటించాల్సినవి..
- అన్ని వేళల్లో సర్జికల్ మాస్కు ధరించటం తప్పనిసరి. 8 గంటల తర్వాత లేదా తడిగా మారితే తొలగించాలి. దానిని సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రపరిచిన తర్వాతే పడేయాలి.
- తప్పనిసరిగా ప్రత్యేక గదిలోనే ఉండాలి. ఇతరులతో ముఖ్యంగా వృద్ధులు, ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండాలి.
- రోగి తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి. ద్రవ పదార్థాలను అధికంగా తీసుకోవాలి.
- తరచూ చేతులను 40 సెకన్లపాటు సబ్బుతో కడగాలి. లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ వాడాలి.
- వ్యక్తిగత వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. గదిలో తరచూ తాకే వస్తువులు, ఉపరితలాలను ఒక శాతం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రం చేస్తూ ఉండాలి.
- వైద్యుల సూచనలను పాటిస్తూ మందులను క్రమ తప్పకుండా వేసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత, వ్యాధి లక్షణాలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.