ఉపరాష్ట్రపతి పదవికే వెంకయ్యనాయుడు వన్నెతెచ్చారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. కీలక సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరు స్ఫూర్తిదాయకమన్నారు. వెంకయ్య నాయుడు మాటల్లో కళాత్మకత ఉంటుందన్నారు.
వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి మంగళవారం నాటితో మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ మూడేళ్ల ప్రయాణంలో ఎదురైన ప్రధానఘట్టాలను క్రోడీకరించి 'కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఛేంజింగ్' పేరుతో రూపొందించిన పుస్తకాన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విడుదల చేశారు. ఈ పుస్తకం డిజిటల్ వెర్షన్‌ను కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి ప్రకాశ్‌జావడేకర్ ఆవిష్కరించారు.
"ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలనే విషయాలు వెంకయ్యనాయుడు నుంచి నేర్చుకోవచ్చు. మన మాటలను బట్టే మనం ఎలాంటి వారమో తెలుస్తుంది. వెంకయ్యనాయుడికి అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వెంకయ్య మాటల్లో కళాత్మకత ఉంటుంది. ఉపరాష్ట్రపతి కాకముందు నుంచి వెంకయ్యనాయుడిని గమనిస్తున్నా. కీలక సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరు స్ఫూర్తినిస్తోంది."
-రాజ్‌నాథ్‌సింగ్, రక్షణ మంత్రి
ఆనందంగా ఉంది..
పుస్తకావిష్కరణ అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఉప రాష్ట్రపతిగా మూడేళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. గత మూడేళ్లలో రాజ్యసభ చాలా మారిందని, సభ పనిచేసే సమయం పెరిగిందన్నారు. రాజ్యసభలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని, ముఖ్యమైన బిల్లులపై సమగ్ర చర్చకు అవకాశం లభించిందన్నారు.
"మొదట్నుంచీ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నా. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా. త్వరలోనే సాధారణ పరిస్థితులు రావాలని కోరుకుంటున్నా. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరిన్ని పరిశోధనలు, అవిష్కరణలు రావాలి. నూతన ఆవిష్కరణల్లో యువత పాత్ర కీలకం కావాలి. జన్మభూమి రుణం తీర్చుకునేలా యువత కార్యక్రమాలు చేపట్టాలి. పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యం. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి రావాలి. ఆర్థిక స్థిరత్వానికి ఇటీవల కాలంలో చాలా చర్యలు తీసుకున్నారు"
-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
తన పదవీ కాలంలో మూడో ఏడాది కీలకమని, ఆ సమయంలో కీలక బిల్లులకు ఆమోదం లభించిందని వెంకయ్యనాయుడు అన్నారు. ముమ్మారు తలాక్, ఆర్టికల్ 370 రద్దు, పౌర సవరణ చట్టం వంటి బిల్లులు ఆమోదం పొందాయన్నారు.
ఇదీ చదవండి: 'ఉపాధి హామీ పెంచి.. ఆ పథకం అమలు చేయండి'