ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన నివాసంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్), చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) ఏర్పాటు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత రైల్వే బోర్డులో ఛైర్మన్ సహా 8 మంది సభ్యులు ఉండగా.. ఆ సంఖ్యను 5కు తగ్గిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రైల్వేలో ప్రస్తుతమున్న 8 కేడర్లను ఒకే కేడర్ ఇండియన్ రైల్వే సర్వీస్‌గా మారుస్తున్నట్లు స్పష్టం చేసింది. అటల్ జల్ యోజనతోపాటు అటల్ టన్నెల్, ఆయుధ చట్టంలో మార్పులు, దివాళా కోడ్ సవరణ ఆర్డినెన్స్‌కూ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
1999 కార్గిల్ సమీక్షా కమిటీ సిఫారసు మేరకు సీడీఎస్ పదవిని సృష్టించినట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ స్పష్టం చేశారు. ఎన్పీఆర్ నమోదుకు ఎలాంటి పత్రాలు అవసరం లేదన్న ఆయన.. 2021 జనగణనతో పాటు జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) ప్రక్రియను కాగితరహితంగా చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకోసం ఓ యాప్ తయారు చేసినట్లు ప్రకటించారు.
" చాలాకాలంగా జరుగుతున్న జనగణనలో ఇది 16వది. దీనితో పాటు జాతీయ జనాభా రిజిస్టర్ కూడా చేపడతాం. ఈ ప్రక్రియ 2010లో యూపీఏ హయాంలోనే ప్రారంభమైంది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎన్పీఆర్ కార్డులు కూడా పంపిణీ చేశారు. జాతీయ జనాభా రిజిస్టర్లో నమోదైనట్లుగా అవే సాక్ష్యం. ఇందుకోసం దాదాపు 13 వేల కోట్లు కేటాయించాం. ఈ మొత్తంలో జనగణన కోసం రూ. 8,754 కోట్లు, ఎన్పీఆర్ కోసం రూ.3,941 కోట్లు కేటాయించాం. వీటితో సంక్షేమ పథకాల ప్రయోజనం పొందేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. అర్హులైన లబ్ధిదారులందరూ పథకాల ప్రయోజనం పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది."
- ప్రకాశ్ జావడేకర్, కేంద్ర సమాచార శాఖ మంత్రి