భారత్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన పరిశోధకుల బృందం కొత్త రకం బొరియ కప్ప జాతిని గుర్తించింది. ఉత్తర బెంగళూరులోని రంజన్కుంటే ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్న సమయంలో ఈ కప్పను గుర్తించారు పరిశోధకులు. నగరానికి గౌరవ సూచికలా దీనికి 'స్ఫేరోథెకా బెంగళూరు'గా నామకరణం చేశారు. వీరి పరిశోధన వివరాలు జూటక్సా అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
మౌంట్ కార్మెల్ కళాశాల సహాయ ఆచార్యులు దీపక్, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(పుణె)కు చెందిన కేపీ దినేశ్, ఫ్రాన్స్‌కు చెందిన అన్నామేరీ ఓహ్లర్, సెంటర్ ఫర్ ఎకోలాజికల్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ కార్తిక్ శంకర్, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (కాలికట్)కు చెందిన చెన్నకేశవమూర్తి, మైసూరులోని యువరాజా కళాశాలకు చెందిన ప్రొఫెసర్ జేఎస్ ఆశాదేవీ ఈ పరిశోధనలో పాల్గొన్నారు.
"భారత్‌లో ఉభయచర జీవుల అన్వేషణ ఇటీవల పెరిగింది. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో అన్వేషణలో భాగంగా దీపక్.. కొత్త జాతిని గుర్తించారు. ఇతర శాస్త్రవేత్తలతో సంయుక్తంగా అధ్యయనం చేసి తన పరిశోధన వివరాలను ప్రచురించారు."
- పరిశోధకుల ప్రకటన
కప్ప నమూనాలను ఇతర జాతి నమూనాలతో పోల్చి చూసినట్లు పరిశోధకులు తెలిపారు. అయితే వాటితో ఈ నమూనాలు సరిపోలలేదని స్పష్టం చేశారు. బెంగళూరు చుట్టుపక్కల సెప్టెంబర్ 2018 నుంచి అక్టోబర్ 2019 వరకు నిర్దిష్ట క్షేత్ర స్థాయి పరిశోధనలు జరిపినట్లు చెప్పారు.
బెంగళూరులో ఊహించని ప్రదేశాల్లో కప్ప జాతిని గుర్తించినట్లు చెప్పారు పరిశోధకులు. నగరంలో కొత్త జాతులు ఉన్నాయనే విషయాన్ని ఈ ఆవిష్కరణ సూచిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో నీటి కాలుష్యం పెరుగుతుందనే విషయాన్ని ఎత్తిచూపుతున్నట్లు చెప్పారు.