ఆర్థికాభివృద్ధి, ప్రజా సంక్షేమం... జమ్ము, కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసినప్పుడు కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాలివి. ఈ రెండింటినీ సాధించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. కానీ.. వాస్తవ పరిస్థితులు చూస్తే ఇవి సాధ్యపడలేదని స్పష్టమవుతోంది. స్థానికుల్లో నిరాశ, నిస్పృహలే కనిపిస్తున్నాయి.
ఆర్టికల్ 370, 35ఎ జమ్ము, కశ్మీర్ అభివృద్ధికి అవరోధాలుగా మారాయన్నది మోదీ సర్కార్ మొదటి నుంచి చెబుతూ వచ్చిన మాట. సామాజిక, ఆర్థిక పురోగతి సాధ్యపడాలంటే వీటిని రద్దు చేయాల్సిందేనని వాదించింది. జమ్ము-కశ్మీర్, లద్దాఖ్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చటం వల్ల నిత్యం ఘర్షణ వాతావరణం ఉండే లోయలో శాంతి పునరుద్ధరణ సాధ్యపడుతుందనీ పేర్కొంది.
బడ్జెట్లో దక్కని నిధులు...
ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులే చెబుతున్నాయి.. అక్కడి పురోగతి ఏ మేర సాధ్యపడిందో. 2020-21 ఏడాదికి గానూ మోదీ సర్కార్ జమ్ము-కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి 30 వేల 757 కోట్ల రూపాయలు.. లద్దాఖ్‌కు 5 వేల 958 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. లక్ష్యాలు పెద్దవిగా నిర్దేశించుకున్న కేంద్రం అందుకు తగ్గట్టుగా బడ్జెట్ కేటాయించలేదన్నది ఆర్థిక విశ్లేషకుల మాట. అసలు ఈ ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం తీరేంటో ఈ లెక్కలే చెబుతున్నాయన్న వారూ ఉన్నారు. సంక్షేమం మాట అటుంచితే...ఈ పునర్నిర్మాణం కారణంగా జమ్ముకశ్మీర్ ప్రజలు ఇబ్బందులకు గురువుతున్నారని క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియజేస్తున్నాయి. అసలు ఈ నిర్ణయం వల్ల సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్తగా ఆర్థిక సంక్షోభం తలెత్తిందని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తీవ్ర అసంతృప్తి...
జమ్ముకశ్మీర్ ప్రజల శ్రేయస్సు కోసమే స్వయం ప్రతిపత్తి రద్దు చేసినట్టు కేంద్రం చెప్పినా.. ప్రస్తుతం వారంతా ఆర్థిక ఇబ్బందుల్లో పడి జీవనం సాగించటమే కష్టంగా మారింది. ఏడాది కాలంగా నిరుద్యోగిత పెరిగిందని గణాంకాలే చెబుతున్నాయి. ఉన్న వారే ఇన్ని సమస్యలతో సతమతం అవుతుంటే.. మళ్లీ బయట వ్యక్తులకు స్థిరనివాస చట్టం కింద ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామనటం స్థానికుల్లో ఇంకాస్త ఆందోళన పెంచుతోంది. స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తల్లోనూ ఇదే అసహనం కనిపిస్తోంది. వీరిలో కొంత మంది కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించినా ఇప్పుడు వాళ్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పరిపాలనా యంత్రాంగం, కేంద్ర ప్రభుత్వం తమ లక్ష్యాలు చేరుకోవటంలో విఫలమయ్యాయని విమర్శిస్తున్నారు.
ఏడాదిగా వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోవటం మరో పెద్ద సమస్యగా మారింది. 70 ఏళ్లలో అపరిష్కృతంగా ఉన్న సమస్యని తాము పరిష్కరించామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ.. పరిస్థితుల్లో మార్పు తీసుకురావటంపై దృష్టి పెట్టలేదన్నది కొందరి విశ్లేషకుల అభిప్రాయం. అసలు ఈ 70 ఏళ్లలో జమ్ము, కశ్మీర్ సాధించుకుంది అంతా ఒక్క ఏడాదిలోనే కోల్పోయిందని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేతలు మండి పడుతున్నారు. రాజకీయ అనిశ్చితి సమసిపోయి ప్రత్యేకంగా స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించిన వారికీ అసంతృప్తే మిగిలింది. ఏడాది గడిచినా ఇందుకు సంబంధించి ఎలాంటి ముందడుగు పడలేదు.
ఆశలు ఆవిరి...
జమ్ము, కశ్మీర్ ప్రజా సంక్షేమం కోసం కేంద్రం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని అంతా విశ్వసించారు. కానీ.. ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయని అప్పట్లో మద్దతు తెలిపిన పలువురు పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. కేంద్రం నిర్ణయాన్ని ప్రజలూ స్వాగతించారని.. తమకు మంచి జరుగుతుందని భావించారని.. ఇప్పుడు ఆ ఆశలు అడియాసలయ్యాన్నది ఇంకొందరి మాట. దాదాపు అన్ని చోట్లా ఇలా అసంతృప్తి గళాలే వినిపిస్తున్నాయి. ఇక కేంద్రం చెప్పినట్టుగా కశ్మీర్ లోయలో ఘర్షణ వాతావరణమైనా ముగిసిందా అంటే అదీ లేదు. ఈ ఏడాది కాలంలో ఆ అశాంతి ఇంకా రగులుతూనే వచ్చింది. ఉగ్రవాద కార్యకలాపాలు మొదట్లో కాస్త తగ్గినట్టు అనిపించినా మళ్లీ పుంజుకున్నాయి.
ఉగ్రవాదంపై పోరూ విఫలమే..!
"ఆర్టికల్ 370.. లోయలో వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని పెంపొందించింది"... గతేడాది పార్లమెంట్‌లో 370 అధికరణ రద్దుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలివి. స్వయం ప్రతిపత్తి రద్దుతో ఈ సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. అసలు జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం ప్రవేశించటానికి ఆర్టికల్ 370యే కారణమని.. ఈ అధికరణ రద్దు చేయటం అంటే పరోక్షంగా ఉగ్రవాదాన్ని అణిచివేయటమేననీ కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలోనే మోదీ ప్రభుత్వం అక్కడ దాదాపు 8 నెలల పాటు కర్ఫ్యూ విధించింది. అల్లర్లు, విధ్వంసం చెలరేగకుండా.. అంతర్జాలం, ఎస్‌ఎమ్‌ఎస్‌లు, ల్యాండ్‌లైన్ సేవలనూ కొన్ని నెలల పాటు నిలిపివేసింది.
కర్ఫ్యూ విధించిన సమయంలో శ్రీనగర్‌లోని అంచర్‌లో తప్ప ఎక్కడా ఎలాంటి అల్లర్లు జరగలేదు. టెలీ కమ్యూనికేషన్ సేవలు పూర్తిగా నిలిపివేయటం వల్ల తీవ్రవాదుల కదలికలూ తగ్గాయి. ఫలితంగా.. ఆ సమయంలో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిలిచిపోయినట్టు భద్రతా అధికారులు తెలిపారు. కానీ.. ఈ జనవరి నుంచి మళ్లీ తీవ్రవాద కదలికలపై భద్రతా దళాలు నిఘా ఉంచటం ప్రారంభించాయి.
ఈటీవీ భారత్ సేకరించిన సమాచారం ప్రకారం చూస్తే.. గతేడాది ఆగస్టు 5 వ తేదీ నుంచి కశ్మీర్ లోయలో హింస పెరిగింది. ఆగస్టు 5 నుంచి జులై 23వ తేదీ వరకు జమ్ము, కశ్మీర్‌లో భద్రతా బలగాలు, తీవ్రవాదుల మధ్య మొత్తం 112 ఎన్‌కౌంటర్లు, దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో 178 మంది తీవ్రవాదులు, 39 మంది భద్రతా సిబ్బంది, 36 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
భిన్నంగా వాస్తవాలు...
కశ్మీర్ లోయలో శాంతి నెలకొల్పటమే లక్ష్యం అని కేంద్రం చెబుతుంటే.. అందుకు భిన్నంగా ఉన్నాయి అక్కడి పరిస్థితులు. ఇక తీవ్రవాదం వైపు అడుగులు వేస్తున్న యువత సంఖ్యా పెరుగుతోంది. తీవ్రవాదాన్ని సహించేది లేదన్న మోదీ సర్కార్ ఆదేశాలకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదంతా చూస్తే... అంతకు ముందున్న పరిస్థితులకూ ఇప్పటికీ పెద్దగా తేడా ఏమీ కనిపించటం లేదు. శాంతి, సంక్షేమ లక్ష్యాలు పెట్టుకున్నా వాటిని సాధించటంలో మాత్రం ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని అధిగమించటంపై మోదీ సర్కార్ దృష్టి సారించటం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఇదీ చూడండి:- పీఓకేలో ఆనకట్ట నిర్మాణంపై భారత్ తీవ్ర నిరసన