పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ రవిపూజారి దక్షిణాఫ్రికాలో అరెస్టయ్యాడు. అతడిని కర్ణాటకకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సోమవారం తెల్లవారుజామున భారత్‌కు తీసుకువస్తున్నట్లు సమాచారం.
బాలీవుడ్ సినీ పరిశ్రమ, కర్ణాటకలో హత్యలు, బెదిరింపు వంటి 200కు పైగా కేసుల్లో నిందితుడైన రవి గత 15 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం సెనెగల్ పోలీసులకు పట్టుబడిన పూజారికి గతేడాది అక్కడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ నిబంధనలను అతిక్రమించిన అతడు దక్షిణాఫ్రికాకు పరారయ్యాడని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సెనెగల్, దక్షిణాఫ్రికా పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో భద్రతా సిబ్బందికి చిక్కాడు రవి పూజారి. అతడ్ని సెనెగల్‌కు తరలించి.. అధికారికంగా భారత అధికారులకు అప్పగించారు.
ఇదీ నేపథ్యం!
90వ దశకంలో అండర్‌వరల్డ్ డాన్‌గా వెలుగొందాడు రవి పూజారి. గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ బృందంలో తొలుత పనిచేసిన పూజారి అనంతరకాలంలో దావుద్ ఇబ్రహీంకు దగ్గరయినట్లు తెలుస్తోంది.
పూజారిపై మంగళూరు పోలీస్ స్టేషన్లో 26, బెంగళూరులో 29 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూరు, మంగళూరు ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యవహారాలను చక్కబెడుతున్నట్లు సమాచారం. రవి పూజారిని వెనక్కి తీసుకొచ్చిన అనంతరం ఎన్ఐఏ, సీబీఐ, భారత నిఘా సంస్థ-రా సిబ్బంది విచారించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: ట్రంప్ కోసం 'పోలీస్ అమ్మ' డ్యూటీ- పసి బిడ్డతో కలిసి...