భారత్‌లో జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక.. దేవదేవుడైన పూరీ జగన్నాథుడికి ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర. దేవతలంతా కదలి వస్తారని భక్తులు విశ్వసించే ఈ యాత్రకు వచ్చేవారి సంఖ్య లక్షల్లోనే. బలభద్రా సమేతుడై ఠీవీగా కదిలి వచ్చే జగన్నాథుడి రథాన్ని ఒక్కసారైనా లాగి తరించాలని ప్రతి భక్తుడి కోరిక. లోకాలను ఏలే రథారోహుడు ఆ జగన్నాథుడి దివ్య మంగళ రూపాన్ని కనుల నిండా చూడాలని, తాడును లాగి జన్మను ధన్యం చేసుకోవాలని అనుకుంటారు. అందుకే ప్రతి ఏటా జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారు.
సందిగ్ధం..
పూరీ జగన్నాథుడి రథయాత్ర ఈ సంవత్సరం జూన్ 23న జరగనుండగా, కరోనా నేపథ్యంలో ఈసారి జగన్నాథ రథచక్రాలు కదులుతాయా లేదా అన్న సందిగ్ధత నెలకొంది. దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న క్రమంలో లక్షల మంది తరలివచ్చే జగన్నాథ యాత్ర ఈ సారి యథావిథిగా జరుగుతుందా? ఒక వేళ ఉంటే ఎలా నిర్వహిస్తారు? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.
భక్తులు లేకుండా?
జగన్నాథ రథ యాత్ర నిర్వహణ, దాని తీరుతెన్నులపై ప్రశ్నలు తలెత్తుతుండగానే వందల ఏళ్ల నాటి సంప్రదాయాన్ని ఆపేది లేదని దేవస్థానం అర్చకులు, నిర్వాహకులు అంటున్నారు. ఆలయ నిర్వహణను పర్యవేక్షిస్తున్న దైతపతి సేవకులు 18వ శతాబ్దంలో తీవ్రమైన కరవు వచ్చినపుడు కూడా రథయాత్రను ఆపలేదని గుర్తు చేస్తున్నారు. భక్తులు లేకుండా తామే నిర్వహిస్తామని అంటున్నారు. భక్తులు లేకుండా రథాన్ని లాగేది ఎవరనే ప్రశ్నలు తలెత్తుతుండగా, తమ కుటుంబంలోని 36 మంది నియోగులు రథాన్ని లాగుతారని దైతపతి సేవకులు చెబుతున్నారు. జగన్నాథుడి పవిత్ర స్నానం జరిగేటప్పుడు పాటించే నిబంధనలు పాటిస్తే సరిపోతుందని అంటున్నారు.
వడివడిగా ఏర్పాట్లు..
జగన్నాథ రథయాత్రపై సందిగ్ధత నెలకొన్నా అందుకు కావాల్సిన ముందస్తు ఏర్పాట్లు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. రథయాత్రలో వినియోగించే మూడు రథాల తయారీని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. 200 మంది పనివాళ్లు రథాలను నిర్మించే పనుల్లో నిమగ్నమయ్యారు. ముందు జాగ్రత్తగా వీరితో పాటు 754 మంది ఆలయ ఉద్యోగులు, దైతపతి సేవకులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగెటివ్ అని తేలింది. కరోనా సోకకుండా అందరికీ హోమియోపతి ఔషధాలు అందజేశారు.
ఒడిశా ప్రభుత్వ నిర్ణయమే కీలకం..
పూరీ జగన్నాథ యాత్ర నిర్వహణపై ఒడిశా ప్రభుత్వ నిర్ణయం కీలకంగా మారనుంది. ఆలయ అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని వారు అంటున్నారు. కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం భక్తులు భౌతిక దూరం పాటించేలా చేసి రథయాత్రను నిర్వహించడమా లేక మరో విధంగానా అన్న అంశం ఒడిశా ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.
ఇదీ చూడండి: 'అయోధ్య రామాలయం కోసం 3 ఎకరాల భూమి చదును'