పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల జ్ఞాపకార్థం జమ్ముకశ్మీర్ లేథ్పొరాలో అధికారులు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన ఉమేశ్ గోపీనాథ్ జాదవ్ అనే వ్యక్తి ప్రత్యేక అతిథి విచ్చేశారు. గతేడాది ఇదే రోజున జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలను కలిసేందుకు దేశవ్యాప్తంగా 61వేల కిలోమీటర్లు ప్రయాణించారు గోపీనాథ్. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా.. ఓ సామాన్య భారతీయుడిగా ఈ పని చేసినట్లు చెప్పుకొచ్చారు. గత 16ఏళ్లుగా కర్ణాటక బెంగళూరులో ఉంటున్నట్లు గోపీనాథ్ తెలిపారు.
" పుల్వామా ఉగ్రదాడి అమరులు అందరి కుటుంబాలను కలిశాను. వారి ఆశీర్వాదాలు తీసుకున్నాను. ఉగ్రదాడిలో కొందరు తల్లిదండ్రులు తమ కుమారుడిని కోల్పోయారు. భార్యలు తమ భర్తను పోగొట్టుకున్నారు. మరికొందరు పిల్లలు తమ తండ్రికి దూరయ్యారు. ఇంకొందరు తమ స్నేహితుడిని కోల్పోవాల్సి వచ్చింది. 40 మంది జవాన్ల ఇళ్ల నుంచి, వారి అంతిమ సంస్కారాలు జరిగిన ప్రాంతం నుంచి మట్టిని సేకరించాను. ఒక సామాన్య పౌరుడు నిస్వార్థంగా ఏమి చేయగలడో అదే చేసి చూపించాను."
- ఉమేశ్ గోపీనాథ్ జాదవ్
పేర్లు, ఫొటోలతో స్మారక స్తూపం
పుల్వామా ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలోనే శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి అమరుల త్యాగాలను స్మరించుకున్నారు సీఆర్పీఎఫ్ అధికారులు, సైనికులు. జవాన్ల పేర్లు, ఫొటోలతో పాటు స్మారక స్తూపంపై 'సేవా-నిష్ఠ' అనే నినాదాన్ని పొందుపరిచారు.