మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కోసం భాజపాకు మిత్రపక్షం శివసేన మద్దతు అనివార్యమైంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవిపై శివసేన కన్నేసింది. ఐదేళ్ల కాలాన్ని చెరిసగం పంచుకోవాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రతిపాదించారు.
50-50 సీఎం
శాసనసభ ఫలితాలకు సంబంధించి స్పష్టత వచ్చాక భాజపా, శివసేన వేర్వేరుగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని సగం సగం పంచుకునే విధానాన్ని అమలు చేసే సమయం ఆసన్నమైందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
"మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అందరి కళ్లూ తెరిపించాయి. మిత్రపక్షాలకు, ప్రజలకు ధన్యవాదాలు. అమిత్ షా చెప్పిన ఫార్ములాను మేం పాటించాం. ముఖ్యమంత్రి పదవి విషయంలో 50-50 సూత్రం పాటించాల్సిన సమయం వచ్చింది.
ఈ ఎన్నికల్లో భాజపాకు మేం ఎక్కువ స్థానాలను కేటాయించాం. అయితే ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. మా పార్టీని కూడా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది."
-ఉద్ధవ్ ఠాక్రే, శివసేన అధ్యక్షుడు
ఒర్లి స్థానం నుంచి శివసేన యువ నాయకుడు ఆదిత్య ఠాక్రే విజయంపై ఉద్ధవ్ హర్షం వ్యక్తం చేశారు. తండ్రిగా ఎంతో గర్వంగా ఉందన్నారు.
అధికారం మాదే: ఫడణవిస్
ముంబయి పార్టీ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటుపై సీఎం దేవేంద్ర ఫడణవిస్ మాట్లాడారు. మిత్రపక్షాల మధ్య ఓ ఒప్పందం ఉందని చెప్పినా... వివరాలు వెల్లడించలేదు.
"భాజపా-శివసేన మహా కూటమికి ప్రజలు పూర్తి ఆధిక్యం అందించారు. మహారాష్ట్రలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వం మాదే. ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి రెండు పార్టీల మధ్య ముందుగా ఉన్న ఒప్పందం ప్రకారమే వెళతాం. అయితే ఆ విషయాన్ని సరైన సమయంలో వెల్లడిస్తాం."
-దేవేంద్ర ఫడణవిస్, మహారాష్ట్ర సీఎం
సీఎం పదవీకాలాన్ని రెండు పార్టీలు పంచుకుంటే... శివసేన చరిత్రలో తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని పొందుతుంది. ఇదే లక్ష్యంతో ఈ సారి ఎన్నికల్లో ఆదిత్య ఠాక్రేను బరిలోకి దించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: అధికారం కోసం శివసేనతో కలిసేది లేదు: పవార్