మరాఠీ మాట్లాడే ప్రాంతాల విషయంలో కర్ణాటకతో నెలకొన్న వివాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రం పరిధిలో ఉన్న మరాఠీ మాట్లాడే ప్రాంతాలను తిరిగి రాష్ట్రంలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఆయా ప్రాంతాల కోసం ప్రాణాలర్పించిన వారికి అదే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఆదివారం ట్వీట్ చేసింది.
ప్రస్తుతం కర్ణాటక పరిధిలో ఉన్న బెల్గాం, కొన్ని ఇతర ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతాలు మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉండేవి. ఈ ప్రాంతాలను తిరిగి మహారాష్ట్రలో కలపాలంటూ మహారాష్ట్ర ఏకీకరణ సమితి ఏళ్లుగా పోరాడుతోంది. అలా 1956 జనవరి 17న జరిగిన ఘర్షణలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో జనవరి 17ను అమరవీరుల దినంగా పాటిస్తున్నారు.
విలీనం కోసం పోరాడి ప్రాణాలర్పించిన వారికి నివాళులర్పిస్తూ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కార్యాలయం ట్వీట్ చేసింది. 'కర్ణాటక అధీనంలో ఉన్న మరాఠీ మాట్లాడే, సంస్కృతిని అచరించే ప్రాంతాలను తిరిగి మహారాష్ట్రలో కలపడమే అమరవీరులకిచ్చే నిజమైన నివాళి. అందుకు మేం కట్టుబడి ఉన్నాం. అమరవీరుల గౌరవ సూచికంగా ఈ వాగ్ధానం చేస్తున్నా' అంటూ సీఎంఓ ట్వీట్ చేసింది. మరోవైపు ఈ సరిహద్దు వివాదం సుప్రీంకోర్టులో ఏళ్లుగా నానుతూ వస్తోంది. ఈ క్రమంలో ఉద్ధవ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.