ప్రేమ.. అక్షరాలు రెండే అయినా భావాలు అనంతం. దానికి ఎవరూ అతీతులు కారు. సాధారణంగా ఈ ఫీలింగ్ ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య పుడుతుంది. కానీ తమిళనాడులో ఇద్దరు అమ్మాయిల మనసుల మధ్య చిగురించింది. అయితే ఆ బంధానికి తల్లిదండ్రులు అడ్డుచెప్పగా.. వారిద్దరూ అర్ధాంతరంగా తనువు చాలించారు.
ఇదీ జరిగింది...!
తమిళనాడు నమ్మక్కల్ జిల్లాలోని పెరియమనాలి ప్రాంతానికి చెందిన ఓ మహిళ(23) పాలిటెక్నిక్ పూర్తి చేసి.. పవర్లూమ్ వర్క్ షాప్‌లో పనిచేస్తోంది. ఈమెకు మూడేళ్ల క్రితం వివాహం కాగా.. ఓ మగబిడ్డ కుడా ఉన్నాడు. సమీపంలోని కొట్టాయపాలానికి చెందిన మరో మహిళ(20) అదే వర్క్‌షాప్‌లో పనిచేస్తోంది. తొలుత వీరిద్దరి మధ్య స్నేహం చిగురించగా.. అది కాస్తా ప్రేమగా మారింది. అక్కడితో ఆగని ఆ బంధం.. వారి మధ్య లింగభేదం హద్దుల్ని చెరిపేసి దగ్గర చేసింది.
ఇరువురి సాన్నిహిత్యం గురించి తెలిసిన ఆయా కుటుంబాల పెద్దలు... వారి బంధానికి ఒప్పుకోలేదు. కలవడానికి వీలులేదని హెచ్చరించారు. ఈ చిక్కుల నుంచి 20 ఏళ్ల మహిళను బయటపడేసేందుకు వివాహాన్ని కుదిర్చారు. మే 18న నిశ్చితార్ధం కావాల్సి ఉండగా.. ఇక కలిసే అవకాశం ఉండదని భావించిన ఇద్దరు.. ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ ప్రేమను కాదన్నారన్న కారణంతో ఇద్దరూ ఒకే చీరకు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నారు. ఈ విషయాలను పోలీసులు వెల్లడించారు. సంఘటనాస్థలాన్ని పరిశీలించి..కేసు నమోదు చేసి వారిద్దరికీ నమ్మక్కల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
సుప్రీం ఏమందంటే..!
స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించే సెక్షన్ 377ను.. సుప్రీంకోర్టు గతేడాది రద్దు చేసింది. ఎల్జీబీటీ(లెస్బియన్,గే,బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్లు) హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉందంటూ ఆ వర్గానికి చెందిన పలువురు పోరాటం చేయగా.. చరిత్రాత్మక తీర్పుతో వారికి సాంత్వన కలిగించింది అత్యన్నత న్యాయస్థానం.