రెండు రోజుల విరామం అనంతరం రేపు కర్ణాటక శాసనసభ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో బలపరీక్ష సోమవారమైనా జరుగుతుందా లేదా అనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. సభలో సోమవారం అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై కాంగ్రెస్, జేడీఎస్, భాజపాలు పోటాపోటీగా శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించాయి. బెంగళూరు యశ్వంతపురలో కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్ జరిగింది. కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు కేసీ వేణుగోపాల్, సీఎల్పీ నేత సిద్ధరామయ్య నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. అసెంబ్లీలో ఏ విధంగా ముందుకు సాగాలనే విషయంపై నేతలతో చర్చ జరిపారు. విప్ అంశంపై సుప్రీంకోర్టు నుంచి స్పష్టత వచ్చే వరకు.. బలపరీక్ష జరపకుండా చూడాలని యోచిస్తోంది.
రేపు మరోసారి భాజపా ఎల్పీ భేటీ..
బెంగళూరులోని రమదా హోటల్లో భాజపా శాసనసభా పక్ష సమావేశం జరిగింది. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాషాయ నేతలు చర్చించారు. ఎలాగైనా.. సోమవారం బలపరీక్ష జరిగేలా చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీకి వచ్చే ముందు సోమవారం ఉదయం మరోసారి భేటీ కానున్నారు.
జేడీఎస్ శాసనసభా పక్ష సమావేశం
ప్రస్తుతం ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంలో పడినందున జేడీఎస్ కూడా శాసనసభాపక్ష సమావేశం నిర్వహించింది. బెంగళూరులోని ప్రెస్టీజ్ గోల్ఫ్షైర్ రిసార్టులో జరిగిన ఈ భేటీలో మంతనాలు జరిపారు.
సుప్రీంకు స్వతంత్రులు..
మరోవైపు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు నగేశ్, శంకర్లు.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎలాగైనా సోమవారం సాయంత్రం 5 గంటలలోపు బలపరీక్ష జరిగేలా చూడాలని.. సోమవారం ఉదయం పిటిషన్ దాఖలు చేయనున్నారు.