ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం, ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ అందాలకు ముగ్ధులయ్యారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా. గుజరాత్ అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్ కార్యక్రమం అనంతరం నేరుగా ఆగ్రా వచ్చారు ట్రంప్ దంపతులు. తాజ్ మహల్ ప్రాంగణంలో కాసేపు సరదాగా కలియతిరిగారు. తాజ్ విశేషాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.



'తాజ్ మహల్ అద్భుత ప్రేరణ. భారతీయ సంస్కృతి, విభిన్న సౌందర్యానికి కాలాతీత నిదర్శనం' అని సందర్శకుల పుస్తకంలో రాశారు ట్రంప్.

ప్రేమ మందిరం ముందు ప్రేమపక్షులు..
ట్రంప్ కుమార్తె ఇవాంక, ఆమె భర్త జేర్డ్ కుష్నెర్.. తాజ్ మమల్ ముందు ఆహ్లాదంగా గడిపారు. ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు.




సాదర స్వాగతం..
అంతకుముందు అహ్మదాబాద్ నుంచి ఆగ్రా చేరుకున్న ట్రంప్ దంపతులకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ట్రంప్ తాజ్‌హమల్ వెళ్తుండగా దారిపొడవునా కళాకారులు ప్రదర్శనలు చేశారు. విద్యార్థులు అమెరికా, భారత్ జెండాలను ఊపుతూ ట్రంప్‌కు స్వాగతం పలికారు.