జమ్ముకశ్మీర్ సమస్యపై మరోసారి స్పందించింది అగ్రరాజ్యం అమెరికా. భారత్-పాకిస్థాన్‌లు కోరితే.. ఈ అంశంలో మధ్యవర్తిత్వం చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నారని తెలిపింది శ్వేతసౌధం. 'కశ్మీర్'పై జరుగుతున్న పరిణామాలను చాలా నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.
"కశ్మీర్ విషయంలో భారత్-పాక్ సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా పిలుపునిస్తూనే ఉంది."
- శ్వేతసౌధ ఉన్నతాధికారి
చర్చలకు ముందు ఇదేంటి?
ఈ వారాంతంలో ఫ్రాన్స్‌లో జీ-7 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సందర్భంలోనే ట్రంప్- మోదీల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 'కశ్మీర్' అంశంలో మధ్యవర్తిత్వం నెరపడానికి సిద్ధంగా ఉన్నట్లు శ్వేతసౌధం ప్రకటించడం గమనార్హం.
కశ్మీర్ మాదే...
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసింది. అలాగే రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దీనిపై పాకిస్థాన్ అనవసర జోక్యం చేసుకుంటోంది. అయితే పాక్ వాదనలను భారత్ తోసిపుచ్చింది. కశ్మీర్ పూర్తిగా భారత అంతర్గత విషయమని ప్రపంచానికి తేల్చిచెప్పింది. అయినప్పటికీ దాయాది దేశం తమ అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది.
ఇదీ చూడండి: ''మహాత్ముడు లేకున్నా... ఆయన భావజాలం బతికే ఉంది''