అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరిలో భారత పర్యటనకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ట్రంప్ పర్యటనకు పరిశీలనలో ఉన్న అనువైన తేదీలపై ఇరు దేశాలు చర్చిస్తున్నట్లు మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి.
అన్ని అనుకున్నట్లు జరిగితే.. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ భారత పర్యటనకు రావడం ఇదే తొలి సారి అవుతుంది.
ట్రంప్ పర్యటనలో భారత్- అమెరికాల మధ్య కీలక ఒప్పందాలు కుదరనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా భారత్- అమెరికా మధ్య 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేసే అవకాశం ఉంది.
మరీ ముఖ్యంగా భారత్‌కు 'ప్రాధాన్యాల సాధారణ వ్యవస్థ' (జీఎస్పీ) హోదాను ట్రంప్ పునరుద్ధరించొచ్చని మోదీ సర్కారు ఆశిస్తోంది.
గత ఏడాది గణతంత్ర దినోత్సవానికి రావాల్సిందిగా ట్రంప్‌ను భారత్ ఆహ్వానించినా.. ఆయనకు కుదరలేదు.
ఇదీ చూడండి:ఆ డిమాండ్లకు విలువలేదు: 'ఈటీవీ భారత్'తో జేఎన్‌యూ వీసీ