దిల్లీలో మరో లారీ యజమానికి భారీ జరిమానా విధించారు రోహిణి ట్రాఫిక్ పోలీసులు. అధిక బరువు, సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా హరియాణాకు చెందిన లారీకి రూ.2 లక్షలు చలానా రాశారు. ఇప్పటివరకు రవాణా శాఖలో ఇదే అత్యధిక జరిమానా.
పత్రాలు లేని కారణంగా..
హరియాణా రిజిస్ట్రేషన్ నంబరుతో ఉన్న లారీని దిల్లీ రవాణా శాఖ అధికారులు జీటీ కర్నాల్ రోడ్ వద్ద ఆపి తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, కాలుష్యం పరీక్ష, ఆర్సీ, ఫిట్నెస్, అనుమతికి సంబంధించి పత్రాలతో పాటు సీటు బెల్ట్ లేని కారణంగా చలానా విధించారు.
వీటితోపాటు అధిక బరువుకు రూ.20వేలు, ఆపైన అదనపు టన్ను నిబంధనతో మరో రూ.36వేలు జరిమానా పడింది. అన్ని కలిపి మొత్తం రూ.2,00,500కు చేరింది. ఈ జరిమానాను రోహిణి కోర్టులో లారీ యజమాని చెల్లించినట్లు సమాచారం.
మోటారు వాహనాల చట్టం కొత్త నిబంధనల ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలను నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. గతవారంలోనే దిల్లీలోని ఇదే రోహిణి ప్రాంతంలో ఓ లారీకి అధిక బరువు కారణంగా రూ.1.41 లక్షలు చలానా వేశారు.
ఇదీ చూడండి: అధిక బరువుకు రూ.1.41 లక్షల చలానా