కంటైనర్లలో ఎలా నిల్వ చేస్తారు ?
ఆసక్తి ఉన్న వారికి కంటైనర్లను గోదాములుగా వినియోగించుకునే వీలు కల్పిస్తాం. గోదాముల నిర్మాణానికి భారీగా వ్యయం అవుతుంది. అదే కంటైనర్లయితే బాడుగకు తీసుకుంటే సరిపోతుంది. మా ద్వారా ఉత్పత్తులను రవాణా చేసుకుంటే, ఎలాంటి అదనపు రుసుము లేకుండా 15 రోజుల పాటు కంటైనర్లు వినియోగించుకునే సదుపాయాన్ని ఇస్తున్నాం. ప్రస్తుతం 12 వేల కంటైనర్లు ఉన్నాయి. మరో 11 వేల కంటైనర్ల కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించాం. ప్రస్తుతం 270 రైల్వే ర్యాక్స్ ఉన్నాయి. నాలుగైదేళ్లలో ఆ సంఖ్యను ఆరొందలకు పెంచుతాం.
నౌకా రవాణా ఏ స్థాయిలో ఉంది ?
ఉత్తరాది నుంచి గుజరాత్ మీదుగా సరకు రవాణా ప్రయోజనకరంగా ఉంది. కాండ్ల పోర్టు నుంచి ట్యుటికోరిన్‌కు వారాంతాలో సరకు రవాణా చేస్తున్నాం. తూర్పు తీరంలో కూడా చేపట్టాం. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌కు అనుసంధానం చేస్తున్నాం. రోడ్డు మార్గంలో వెళితే సరిహద్దుల్లో వారాల తరబడి వాహనాలు వేచి ఉండాలి. నౌకా రవాణాతో ఆ సమస్య పరిష్కరించాం.
సంస్థలో వాటా తగ్గించుకునే ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా ?
ఆ విషయంలో ఎలాంటి సమాచారం లేదు. అలాంటి నిర్ణయమేదైనా ప్రభుత్వ స్థాయిలో జరుగుతుంది. ప్రస్తుతతం ప్రభుత్వానికి 54 శాతం వాటా మాత్రమే ఉంది. మిగిలిన 46 శాతం వాటా ప్రజల వద్దే ఉంది.
తెలంగాణలో డ్రైపోర్టు నిర్మాణ ప్రణాళికలు ఏమిటి ?
తెలంగాణలో అత్యాధునిక డ్రైపోర్టును హైదరాబాద్ సమీపంలోని నాగులపల్లిలో నిర్మించాలన్నది యోచన. 64 ఎకరాలు కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. స్థలం కేటాయిస్తే, నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ నుంచి భిన్న దేశాలకు సరకు రవాణా ఇప్పటికే భారీగా జరుగుతోంది. రానున్న రోజుల్లో డిమాండ్ మరింత ఉంటుంది. ఆ అంచనాలతోనే ఆధునాతన డ్రైపోర్టు నిర్మించాలని నిర్ణయించాం.
ఆంధ్రప్రదేశ్‌లో నౌకాశ్రయాల పనితీరు ఎలా ఉంది ?
చాలా బాగుంది. విశాఖపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ద్వారా దేశవిదేశాలకు ఎగుమతులు భారీగా సాగుతున్నాయి. విశాఖపట్నం నుంచి జులైలో రికార్డు స్థాయిలో 40 ర్యాక్స్ ద్వారా నేపాల్‌కు నిత్యావసరాలతో పాటు వివిధ ఉత్పత్తులు ఎగుమతి చేశాం. సాధారణంగా నెలకు 16 ర్యాక్స్‌కు మించి ఎగుమతయ్యేవి కావు. మేము అనుసరిస్తున్న విధానాలతో త్వరితంగా, సులువుగా సరకు రవాణా అవుతున్నందున, వ్యాపారులు కూడా ముందుకొస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నుంచి పూర్తి సహకారం అందుతోంది.
వచ్చే అయిదేళ్ల ప్రణాళికలు ఏమిటి ?
దేశీయంగా, ఆంతర్జాతీయంగా మార్కెట్ వాటాను 80 శాతానికి పెంచాలన్నది లక్ష్యం. ప్రస్తుతం 75.6 శాతం ఉంది. అంతర్జాతీయ సరుకు రవాణాలో 76 శాతం, దేశీయంగా 66 శాతం ఉంది. మార్కెట్ వాటా పెంచుకునేందుకు నూతన వ్యాపార మార్గాలు అన్వేషిస్తున్నాం.
నూతన వ్యాపార అవకాశాలు ఎలాంటివి ?
సరకును బల్క్‌గా రవాణా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందుకు కంటైనర్లు వినియోగిస్తాం. ఉత్పత్తుల్లో 80 శాతం వరకు ఇలానే రవాణా చేయాల్సి ఉంటుంది. కంటైనర్ సదుపాయాలు లేక బస్తాల్లో రవాణా చేస్తున్నారు. ఇందువల్ల పర్యావరణ సమస్యలతో పాటు ఖర్చు కూడా అధికమే. సిమెంటు, ఇండస్ట్రియల్ సాల్ట్, దేశీయ ఉప్పు, ఆహార ధాన్యాలను కూడా బల్క్‌గా రవాణా చేసే వీలుంది. మా అంచనా ప్రకారం ఏడాదికి 500 మిలియన్ టన్నుల రవాణాకు అవకాశం ఉంది. తొలి మూడు నాలుగేళ్లలో 50 మిలియన్ టన్నుల ఎగుమతికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనే బల్క్ రవాణా ప్రారంభిస్తాం.
గోదాముల కొరతను ఎలా అధిగమిస్తారు ?
దేశంలో గోదాముల కొరత తీవ్రస్థాయిలో ఉంది. దీన్ని అవకాశంగా మార్చుకునేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాం. తయారీదారుల నుంచి నేరుగా సరకులను నిర్దేశిత ప్రాంతాలకు రవాణా చేసే విధానాన్ని దేశంలో తొలిసారిగా తెలంగాణ నుంచి శ్రీకారం చుట్టాం. కేరళ రాష్ట్రానికి అవసరమైన ఉప్పుడు బియ్యం తెలంగాణ నుంచి ఎఫ్‌సీఐ పంపుతోంది. ఎఫ్‌సీఐతో సంప్రదించి, మిల్లుల నుంచి బియ్యాన్ని నేరుగా మా కంటైనర్లలో నింపి కేరళకు పంపే విధానాన్ని ప్రయోగాత్మకంగా ఇటీవల చేపట్టాం. ఇందువల్ల ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వ చేయాల్సిన అవసరం లేదు. వృథా అయ్యేది లేదు. ఆర్థికంగా ఎఫ్‌సీఐకి చాలా ఉపయుక్తం. దేశీయ సరుకు రవాణా(డొమెస్టిక్ లాజిస్టక్స్‌ను) పెంచేందుకు దేశంలో 17 డ్రైపోర్టులను నిర్మిస్తాం. ఈ ఏడాది రూ. 750 కోట్లు కేటాయించాం.
ఇదీ చూడండి:'కశ్మీర్' భారత్-పాక్‌ల ద్వైపాక్షిక అంశమే: ఫ్రాన్స్