ఒడిశాలో లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. కొరై అసెంబ్లీ స్థానంలో పోటీకి ఓ ట్రాన్స్‌జెండర్ బరిలో నిలవటంతో అక్కడ పోరు ఆసక్తికరంగా మారింది. పోటీ చేసేందుకు కాజల్ నాయక్ అనే ట్రాన్స్ జెండర్ ముందుకురాగా బహుజన్ సమాజ్ పార్టీ టికెట్ ఖరారు చేసింది.
ఒడిశా జైపూర్‌లో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు కాజల్ నాయక్. జైపూర్ ట్రాన్స్జెండర్ల సమాఖ్యకు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది నాయక్.
"చాలా రాజకీయ పార్టీలను సంప్రదించాను. కానీ నన్నెవరూ లెక్క చేయలేదు. నాకు అవకాశం ఇచ్చిన బీఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ట్రాన్స్జెండర్ల సమాజంపై సానుకూలంగా వ్యవహరించినందుకు పార్టీకి ధన్యవాదాలు."
-కాజల్ నాయక్ , బీఎస్పీ నేత"వివిధ వర్గాల సాధికారతే బీఎస్పీ లక్ష్యం. ఈ కారణంగానే కాజల్ నాయక్‌కు టికెట్ ఇవ్వాలని నిర్ణయించాం. ఎవ్వరూ ట్రాన్స్జెండర్ల గురించి తక్కవ చేసి మాట్లాడకూడదు. వారి అభివృద్ధిని కోరుకుంటే ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేలా కృషి చేయాలి."
- బీఎస్పీ రాష్ట్ర శాఖ