దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
బాక్రా డ్యాం నుంచి భారీగా నీరు విడుదల చేయడం వల్ల పంజాబ్‌లోని పలు జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. లూధియానా, అమృత్‌సర్, మొహాలి, చంఢీఘర్‌లలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సట్లెజ్ నదీ పరివాహ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. యమునా నది ప్రమాదకర స్థాయి 204.5 మీటర్లు కాగా ప్రస్తుతం 203.27 మీటర్ల నీటి ప్రవాహం ఉంది. ఫలితంగా దిల్లీలో వరదలు సంభవించే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు.
రాజస్థాన్‌లో తగ్గని వానలు
రాజస్థాన్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అజ్మీర్‌లో అత్యధికంగా 104.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జోధ్‌పుర్, బికనీర్, వనస్థలి, భిల్వరా, సికర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఛంబల్ నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
కోల్‌కతా అతలాకుతలం
తీవ్ర వర్షాలతో అల్లాడుతున్న కోల్‌కతాలో గత 24 గంటల్లో 186.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి మహా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఆటంకం ఏర్పడింది. విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పట్టాలపై నీరు చేరడం వల్ల పలు లోకల్ రైళ్లను రద్దు చేసినట్లు తూర్పు రైల్వే ప్రతినిధి తెలిపారు. సీల్‌డా, హావ్‌డా వంతెనలపై రైళ్ల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయని అన్నారు.
కేరళలో వరదలు తగ్గుముఖం
కేరళలో వరదలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా సహాయక శిబిరాల్లో ఉన్న ప్రజలు తిరిగి తమ సొంత గ్రామాలకు పయనమవుతున్నారు. వరద ఉద్ధృతికి కేరళలో ఇప్పటికే 113 మంది మరణించారు. కొండచరియలు విరిగిపడిన వయనాడ్, మలప్పురం జిల్లాల్లో శిథిలాల కింద మరిన్ని శవాలను అధికారులు గుర్తిస్తున్నారు.
జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, దిల్లీల్లో రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇదీ చూడండి : దిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం-వైరాలజీ విభాగం దగ్ధం