దిల్లీలోని సౌత్ బ్లాక్‌లో ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ భేటీకి సైన్యాధ్యక్షుడు ఎంఎం నరవాణే అధ్యక్షత వహిస్తున్నారు. రెండేళ్లకొకసారి జరిగే ఈ సమావేశానికి సైన్యంలోని ఉన్నతాధికారులందరూ హాజరయ్యారు. భారత ఉత్తర సరిహద్దులో ఉద్రిక్తతలు చెలరేగుతున్న తరుణంలో ఈ భేటీ జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
పరిపాలనా సమస్యలు, లాజిస్టిక్స్, మానవ వనరుల సమస్యలే భేటీలో ప్రధాన అజెండాగా నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దుందుడుకుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ విషయంపైనా చర్చించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వాయిదా తర్వాత..
రెండేళ్లకొకసారి వారం రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను.. సాధారణంగా మార్చి-ఏప్రిల్, అక్టోబర్ నెలలో నిర్వహిస్తారు. కానీ, దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలను వాయిదా వేశారు. తొలిసారిగా ఈ సమావేశాలను రెండు దఫాలుగా విభజించారు. రెండో దఫా సమావేశాల తేదీలను నిర్ణయించనప్పటికీ జూన్ చివరి వారంలో నిర్వహిస్తారని సమాచారం.
వేదిక మార్పు..
సాధారణంగా ఏసీసీ సమావేశం మానేక్షా సెంటర్లో జరుగుతుంది. అయితే ఈసారి మాత్రం సమావేశాన్ని రక్షణ శాఖ కార్యాలయం ఉన్న సౌత్ బ్లాక్‌లో నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత దూరం వంటి నిబంధనలు పాటిస్తూనే సమావేశం నిర్వహిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.
ఎంతో కీలకం..
భారత ఆర్మీ కార్యకలాపాలకు సంబంధించి ప్రణాళికా రచన అమలు చేసే విధానాలు రూపొందించడంలో ఏసీసీ సమావేశాలు ఎంతో కీలకం. లాజిస్టిక్స్, పరిపాలన, మానవ వనరులు, సంక్షేమం వంటి అంశాలపై సమావేశంలో పూర్తి స్థాయి సమీక్షలు నిర్వహిస్తారు.
ఆర్మీ కమాండర్లు, సీనియర్ అధికారులతో ఏర్పాటైన కాలేజియేట్ వ్యవస్థ ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశానికి ఆర్మీ చీఫ్‌తో పాటు ప్రభుత్వ రక్షణ రంగ సంస్థల డైరక్టర్లు, ఇతర సైనిక విభాగాలకు చెందిన అధికారులు హాజరవుతారు.
మోదీ ఉన్నతస్థాయి సమీక్ష..
చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సమీక్షించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు, త్రివిధ దళాల ప్రధానాధికారి సహా త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: సరిహద్దులో ఉద్రిక్తతపై మోదీ ఉన్నత స్థాయి సమావేశం