హిమాచల్‌ప్రదేశ్ సోలన్ జిల్లాలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. విపత్తు నిర్వహణ దళాలు... మరో జవాన్ మృతదేహాన్ని గుర్తించాయి. ఇప్పటికే ఆరుగురు జవాన్లు, ఒక పౌరుని మృతదేహాలను వెలికితీసిన విషయం తెలిసిందే. శిథిలాల కింద ఇంకా మరో ఏడుగురు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
ముఖ్యమంత్రి సంతాపం..
ఘటనా స్థలానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలపై తక్షణ విచారణ చేపట్టాలని ఆదేశించారు.
భవనం యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితుడు సరైన ప్రమాణాలు పాటించకుండా అక్రమంగా భవన నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు.
పార్టీ కోసం వెళ్లిన జవాన్లు
కుమార్హట్టి ప్రాంతంలోని ఓ నాలుగంతస్తుల భవనం ఆదివారం కుప్పకూలింది. ప్రమాదం సమయంలో 35 మంది ఆర్మీ జవాన్లు ఉన్నారని... ఓ క్షతగాత్రుడు తెలిపాడు.
"దగ్షాయ్ కంటోన్మెంట్ 4వ అసోం రెజిమెంట్‌కు చెందిన జవాన్లు... ఆదివారం కావడం వల్ల పార్టీ కోసం వెళ్లారు. ఆ సమయంలో అకస్మాత్తుగా భవనం కూలిపోయింది."
- ప్రమాదంలో గాయపడిన జవాన్
అదే సమయంలో శిథిలాల కింద రెస్టారెంట్ సిబ్బంది, వినియోగదారులు, జవాన్లు కలిపి సుమారు 50 మంది ఉండొచ్చని రమేష్ అనే వ్యక్తి చెబుతున్నారు.
ఇదీ చూడండి: చంద్రయాన్-2 ప్రయోగం మళ్లీ ఎప్పుడు?