బిహార్‌కు చెందిన లాంగీ భుఈ తన ఊరులోని నీటి కష్టాలను తీర్చడానికి ఒక్కడే.. కొండను తొలిచి కాలువను నిర్మించిన సంగతి మనందరికీ తెలుసు. ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్ ఛతర్పుర్లోని అంగూటాలో జరిగింది. అయితే ఆయనలా ఒంటరిగా కాదు.. ఓ మహిళా బృందం ఇలాంటి పనే చేసింది. ఆ గ్రామంలోని 250 మంది మహిళలు కలిసి తమ ఊరులో నీటి కష్టాలను తీర్చుకోవడానికి 18 నెలలు కఠోరంగా శ్రమించారు. ఓ కొండను తొలచి, అర కిలోమీటర్ మేర కాలువను తవ్వి.. ఊరులో చెరువుకు అనుసంధానం చేశారు.
"వృథాగా అడవిలోకి పోతున్న నీటిని ఊరు చెరువులోకి పంపాలని నిర్ణయించుకున్నాం. ఓ మహిళా బృందాన్ని ఏర్పాటు శాం. 18 నెలలకు పైగా కష్టపడి గ్రామంలోని చెరువుకి అనుసంధానంగా అర కిలోమీటరు మేర కాలువను తవ్వాం."
-- భవితా రాజ్‌పుత్, స్థానిక మహిళ
'తాగడానికి, పంటలు పండించడానికి నీటి కొరతను ఎదుర్కొంటున్నాం. అందుకే ఎంత కష్టమైనా.. రాళ్లు రప్పలతో కూడిన కొండను తొలచి గ్రామంలోని చెరువు వరకు కాలువను తవ్వుకున్నాం. ఇప్పుడు మా ఊరులో నీటి కొరత తీరింది' అని గ్రామానికి చెందిన మహిళలు చెబుతున్నారు.
ఇదీ చూడండి: నీటి కోసం 30 ఏళ్ల పాటు కాలువ తవ్విన భగీరథుడు