కరోనా.... యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. అగ్ర దేశాల వైద్య నిపుణులు కూడా ఈ వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. చెన్నైకి చెందిన ఓ ఆయుర్వేద వైద్యుడు మాత్రం తన వద్ద కరోనా వ్యాధికి ఔషధం ఉందని చెబుతున్నారు. దీంతో 24 నుంచి 40 గంటల్లోనే వ్యాధి నయమవుతుందని అంటున్నారు.
చెన్నైలోని రత్న సిద్ధ ఆస్పత్రిలో ఆయుర్వేద వైద్యులుగా ఉన్నారు డా. థనికసాలం వేణి. కరోనా వ్యాధిని నయం చేసేందుకు అవసరమైన ఔషధాన్ని వనమూలికలతో తయారు చేసినట్లు తెలిపారు. మరికొందరు సభ్యులతో కలిసి దీనిని కనుగొన్నట్లు చెప్పారు.
"వన మూలికల ద్వారా ఈ ఔషధాన్ని కనుగొన్నాం. ఎలాంటి జ్వరాన్నైనా ఇది నయం చేయగలదు. కరోనా వైరస్‌కు మందు లేదు. చైనాలోని వుహాన్‌లో ఈ వ్యాధి బారిన పడి చాలా మంది మరణించారు. వైద్య నిపుణులు దీనికి ఔషధాన్ని కనుగొనలేకపోతున్నారు. మా ఆయుర్వేద ఔషధం డెంగీ, ప్రమాదకర జ్వరాలను నయం చేస్తుంది. కరోనా వైరస్‌పైనా ఈ ఔషధం ప్రభావం చూపుతుందనే నమ్మకం ఉంది."
-డా. థనికసాలం వేణి, ఆయుర్వేద వైద్యులు.
తాము కనుగొన్న ఈ ఔషధం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా ప్రభుత్వాలకు తెలియజేయాలనుకుంటున్నట్లు చెప్పారు డా. థనికసాలం. అవసరమైతే తమిళనాడు రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తన బృందంతో కలిసి చైనా వెళ్లేందుకైనా సిద్ధమంటున్నారు.
భయం వద్దు...
తమిళనాడు ప్రజలు కరోనా వైరస్ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ తెలిపారు. ప్రభుత్వం ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉందన్నారు.
గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్‌లో తొలిసారిగా కరోనా వైరస్‌ను గుర్తించారు. అనంతరం ఇది ప్రపంచ దేశాలకు విస్తరించి బెంబేలెత్తిస్తోంది. భారత్‌లోనూ పలు అనుమానాస్పద కేసులు నమోదైనప్పటికీ ఇంకా అధికారికంగా ఒక్క కేసును కూడా ధ్రువీకరించలేదు.
ఇదీ చూడండి: మరిన్ని దేశాలకు 'కరోనా'- భారత్‌లో పెరిగిన కేసులు