అరవింద్ కేజ్రీవాల్... ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. వరుసగా మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టంగట్టిన దిల్లీ ప్రజలు.. కేజ్రీవాల్ పనితీరును దేశానికి చాటి చెప్పారు. ఫలితంగా కేజ్రీవాల్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన కేజ్రీవాల్ మద్దతుదారులు.. మరో అడుగు ముందుకేశారు. తమ ప్రియతమ నేత జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాల్సిన సమయం ఆసన్నమైందని నినాదాలు చేశారు. దేశ రాజకీయాలను మార్చటమే లక్ష్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
దిల్లీని దాటి..
దిల్లీని దాటి ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు భోపాల్ నుంచి వచ్చిన ఆప్ మద్దతుదారుడు, నిర్మాణ రంగ కార్మికుడు సుమన్ రావ్.
"దిల్లీని దాటి వెళ్లాల్సిన సమయం వచ్చింది. దేశంలోని విషపూరిత రాజకీయ వాతావరణాన్ని మార్చేందుకు పని చేయాలి. దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు విషపూరితంగా మారాయి. దానిని మార్చే విధంగా ఆప్ పనిచేయాలి."
- సుమన్ రావ్, ఆప్ మద్దతుదారుడు.
త్రివర్ణ పతాకాలతో..
రాంలీలా మైదానంలో ఆప్ పార్టీ కార్యకర్తలు త్రివర్ణ పతాకాలను పట్టుకోవటానికి ఓ కారణముందని పేర్కొన్నారు మరో ఆప్ మద్దతుదారుడు ఎర్షాన్ ఖాన్.
"కేజ్రీవాల్‌ను జాతీయ నాయకుడిగా చూడాలనే కారణంతోనే ప్రజలు త్రివర్ణ పతాకాలను పట్టుకున్నారు. కేజ్రీవాల్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన సమయం ఇదే. ప్రతికూల జాతీయవాదాన్ని తొలగించే సమయం ఇది.. ఆ పని ఆప్ మాత్రమే చేయగలదు. "
- ఎర్షాన్ ఖాన్, ఆప్ మద్దతుదారుడు.
దిల్లీ తరహా పాలన విస్తరించాలి
ఆమ్ ఆద్మీ అభివృద్ధి చేసిన స్వచ్ఛ రాజకీయాలు, మంచి పాలనను దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని అభిప్రాయపడ్డారు రాజేశ్ శర్మ.
ప్రాంతీయ పార్టీగా..
ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీని ఎన్నికల సంఘం ప్రాంతీయ పార్టీగానే గుర్తించింది. అయితే.. 2017లో పంజాబ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పాడి దేశ రాజకీయలపై తనదైన ముద్ర వేసింది ఆప్. కానీ గోవా ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ అంతగా రాణించలేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో దిల్లీ నుంచి మొత్తం 7స్థానాల్లోనూ ఓటమిపాలైంది.
ఇదీ చూడండి: ఏకే 3.0: దిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం