ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి దిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేజ్రీవాల్ చేత.. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాంలీలా మైదానంలో కేజ్రీవాల్‌తో పాటు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్, ఖైలాశ్, గహ్లూత్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్ర గౌతమ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
'ధన్యవాద్ దిల్లీ' పేరిట నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
దిల్లీ అభివృద్ధికి సహకరించిన వివిధ వర్గాల నుంచి 50 మందిని, ఇతర పార్టీలకు చెందిన నాయకులను కేజ్రీవాల్ ఆహ్వానించగా.. వారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు.
వారణాసిలో మోదీ..
ప్రమాణ స్వీకారానికి రావాలని ప్రధాని మోదీని కేజ్రీవాల్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే వారణాసి పర్యటన ఉన్నందున మోదీ కార్యక్రమానికి హాజరు కాలేదు.
'ధన్యవాదాలు దిల్లీ' బ్యానర్లతో..
కేజ్రీవాల్ ప్రమాణం నేపథ్యంలో ఆప్ కార్యకర్తలు, మద్దతుదారుల నినాదాలతో రామ్‌లీలా మైదానం హోరెత్తిపోయింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు. రామ్‌లీలా మైదానంతోపాటు పరిసరాల దారులన్నీ.. 'ధన్యవాదాలు దిల్లీ' బ్యానర్లతో నిండిపోయాయి.