సరిహద్దు ఉద్రిక్తతలపై భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా గాంధీ కుటుంబీకులపై విమర్శనాస్త్రాలు సంధించారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. వారసత్వ రాజకీయాలు నడిపే కుటుంబం.. తమ గురించి విపక్షాలు గొప్పగా అనుకుంటున్నాయనే భ్రమలో ఉందన్నారు. తిరస్కరణకు గురైన కుటుంబం.. మొత్తం విపక్షాన్ని కలిపినా సమానం కాదని విమర్శించారు.
ఇది ఐక్యత, సంఘీభావం ప్రదర్శించాల్సిన సమయం అని పేర్కొంటూ..వరుస ట్వీట్లు చేశారు నడ్డా. వారసుడు తిరిగి బాధ్యతలు తీసుకునేందుకు వేచి ఉన్నారంటూ.. రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. ఒక్క కుటుంబ దుస్సాహసం వల్లే వేలాది కిలోమీటర్ల భూభాగాన్ని భారత్ కోల్పోయిందని ఆరోపించారు నడ్డా. సియాచిన్‌ను కూడా దాదాపు కోల్పోయమని అన్నారు. వారిని భారత్ తిరస్కరించటంలో ఆశ్చర్యమేమీ లేదని గాంధీల పేరు చెప్పకుండా విమర్శలు చెశారు.
భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పలువురు ప్రతిపక్ష నేతలు విలువైన ఆలోచనలను పంచుకుంటే.. ఒక్క కుటుంబం మాత్రం విరుద్ధంగా ప్రవర్తించిందని.. ఆ కుటుంబం ఏదో తెలుసుకోండి అంటూ ట్వీట్ చేశారు నడ్డా.
ఇదీ చూడండి: 'రాహుల్ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలి'