నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన దోషులు వారం రోజుల్లోగా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకోవాలని తిహార్ జైలు పాలన విభాగం సూచించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసినట్లు తిహార్ కారాగారం డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ తెలిపారు. ఈ గడువులోపు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకోకపోతే తదుపరి చర్యల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చెప్పారు.
'ఉరి'పై జనవరి 7కు వాయిదా
అంతకుముందు ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు చేయటంపై తీర్పును దిల్లీ పాటియాలా హౌస్ కోర్టు జనవరి 7కు వాయిదా వేసింది. మరణశిక్ష అమలుకు ముందు క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు ఇచ్చింది. ఈ మేరకు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకోవాలని తిహార్ జైలు అధికారులు దోషులకు సూచించారు.