స్వేచ్ఛకు అతిపెద్ద ముప్పుగా పరిణమించిన చైనాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం నిలబడాలని హిమాచల్ప్రదేశ్ ధర్మశాలలో ప్రవాస టిబెటన్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా బీజింగ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిబెట్, భారత జాతీయ గీతాలను ఆలపించారు. తమ నిరసనలో భాగంగా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు.
"అంతర్జాతీయ సంస్థలు, సమాజం చైనాకు వ్యతిరేకంగా నిలబడి, ఆ దేశం జవాబదారీతనంతో ఉండేలా చూడాలి. స్వేచ్ఛకు ప్రపంచస్థాయి ముప్పుగా పరిణమించిన చైనాకు వ్యతిరేకంగా నిరసన చేసి.. అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాం. మాకు మద్దతు ఇవ్వాలని, చైనాకు వ్యతిరేకంగా సమష్టిగా నిలబడాలని కోరుతున్నాం."
-టెన్జిన్ ఖండో, నిరసనకారుల నాయకురాలు
ధర్మశాలలోని ఐదు స్వచ్ఛంద సంస్థలు కలిసి సంయుక్తంగా నిరసనల్లో పాల్గొన్నట్లు టిబెటన్ యూత్ కాంగ్రెస్ చీఫ్ గొన్పో ధొండప్ పేర్కొన్నారు.
"టిబెట్ స్వాతంత్య్రానికి మద్దతు ఇవ్వాలని న్యూదిల్లీలోని అన్ని రాయబార కార్యాలయాలను అభ్యర్థిస్తున్నాం. దీనికి సంబంధించి పిటిషన్ రూపొందిస్తున్నాం. వుహాన్లో ఆవిర్భవించిన కరోనా మహమ్మారి గురించి సమచారాన్ని దాచిన విషయంలో చైనా జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం."
-గొన్పో ధొండప్, టిబెట్ యూత్ కాంగ్రెస్ చీఫ్
ఈ వారం ప్రారంభంలో.. 10 టిబెటన్ అసోసియేషన్ల ప్రతినిధులు కలిసి డబ్ల్యూహెచ్ఓ, ఐరాస అధికారులతో న్యూదిల్లీలో సమావేశమయ్యారు. కరోనావైరస్ మూలాలపై పారదర్శకమైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ మెమోరాండమ్ సమర్పించారు.
ఇదీ చదవండి- అమర్నాథ్ ఆలయంలో రాజ్నాథ్ పూజలు