కర్ణాటక బెంగళూరులో వలస కార్మికులు, ఉద్యోగులు సొంతూళ్ల బాటపట్టారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ మరో లాక్డౌన్ విధించే అవకాశముందని వారంతా ఆందోళన చెందుతున్నారు.
ఒకే రోజు 2,798 కరోనా కేసులు నమోదయిన తర్వాత బెంగళూరులో వారం రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జులై 14 నుంచి 22వ తేదీ వరకు కొనసాగనున్న ఈ లాక్డౌన్ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలవుతోంది.
రాజధానిలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న తరుణంలో.. ప్రభుత్వం మరో లాక్డౌన్ విధిస్తే పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందనుకున్న వేలాదిమంది వలస కార్మికులు, ఉద్యోగులు గ్రామాలబాట పట్టారు. కర్ణాటక ఆర్టీసీలో సోమవారం 231 బస్సులు ముందుగానే ఆన్లైన్ బుకింగ్‌తో నిండిపోయాయి. బస్‌స్టాపుల్లో జనం కిక్కిరిసిపోయారు.
కేవలం జులై 13 ఉదయం 11 గంటల వరకు బెంగళూరు నుంచి 333 బస్సులు నడిపింది కేఎస్ఆర్టీసీ. ఈ బస్సుల్లో 8,938 మంది ప్రయాణికులు స్వగ్రామాలకు బయల్దేరారు. థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి ప్రయాణికులను బస్సుల్లోకి అనుమతిస్తున్నారు ఆర్టీసీ సిబ్బంది.
ఇదీ చదవండి: '15 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు!'