'దిశ' హత్యాచార ఘటనలో నలుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై స్పందించారు దిల్లీ మాజీ కమిషనర్ నీరజ్ కుమార్. గతంలో నిర్భయ హత్యాచార కేసును పర్యవేక్షించించిన ఆయన.. ఆ సమయంలో తమపై చాలా ఒత్తిడి వచ్చిందన్నారు. నిందితులను చంపాలనే ఆలోచన మాత్రం తమకు రాలేదని స్పష్టం చేశారు.
" నిర్భయ ఘటన జరిగిన సమయంలో ప్రజల నుంచి మాకు చాలా సందేశాలు వచ్చాయి. దోషులను ఆకలిగా ఉన్న సింహాల ముందు వేయాలని, బహిరంగంగా వారి వృషణాలు తొలగించాలని, ఉరి తీయాలని కోరారు. కానీ మేము మా తుపాకులను తీయలేకపోయాం. ప్రతి ఎన్కౌంటర్ తర్వాత.. చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. హైదరాబాద్ ఎన్కౌంటర్ తీవ్రవాదులు, గ్యాంగ్స్టర్ల మధ్య జరిగింది కాదు. వాస్తవానికి అక్కడ ఏమి జరిగిందో దర్యాప్తు చేసేందుకు న్యాయ ప్రక్రియ ఉంది. ఎన్కౌంటర్ సరైనదో కాదో తెలుసుకునేందుకు దాని ఫలితాల కోసం వేచి ఉన్నాం. "
- నీరజ్ కుమార్, దిల్లీ పోలీస్ మాజీ కమిషనర్.
'ద ఖాకీ ఫైల్స్' పుస్తకంలో తనకు ఎదురైన సంఘటనను గుర్తు చేసుకున్నారు నీరజ్. నిర్భయ కేసు సమయంలో తన కూతుళ్లను అత్యాచారం చేస్తామని బెదిరింపులు వచ్చాయని.. రాజీనామా చేయాలని డిమాండ్ వచ్చినట్లు రాశారు.
నిర్భయ ఘటన ఆధారంగా నెట్ ఫ్లిక్స్‌లో వచ్చిన 'దిల్లీ క్రైమ్స్'లోనూ ఈ కేసు వెనకాల రాజకీయ హస్తం ఉన్నట్లు చూపించారు.
ఇదీ చూడండి: 'దిశ'కు న్యాయం- సజ్జనార్ స్వస్థలంలో సంబరం