పౌరచట్టంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న నేపథ్యంలో భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఘాటుగా స్పందించారు. ఈ చట్టాన్ని వ్యతిరేకించే వాళ్లు 'నిమ్న వర్గాల వ్యతిరేకులు'అని మండిపడ్డారు. దీని ద్వారా లబ్ధి పొందే వారిలో 70 నుంచి 80 శాతం మంది నిమ్న వర్గాల ప్రజలేనని స్పష్టం చేశారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం వీరిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుందన్నారు. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు.
"పౌరచట్టంపై కాంగ్రెస్ దుష్ప్రచారాలు చేస్తూ మైనారిటీలను తప్పుదోవ పట్టిస్తోంది. ఈ చట్టం మూడు పొరుగు దేశాల నుంచి వచ్చే మైనారిటీలకు పౌరసత్వాన్ని కల్పిస్తుంది. కానీ ఎవరి పౌరసత్వాన్ని తొలగించదు."
-నడ్డా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు
పొరుగు దేశాల్లో మతపీడన ఎదుర్కొంటున్న వారికి పౌరసత్వం కల్పించడం సరైన చర్యేనని నడ్డా సమర్థించారు.
"భారత్ విభిన్న మతాలతో కూడిన దేశం. కానీ పాకిస్థాన్ తాము ఇస్లామిక్ దేశమని బహిరంగంగానే ప్రకటించింది. తూర్పు పాకిస్థాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్గా మారింది. ఆ దేశాల్లో ఉన్న మన హిందూ, సిక్కు, క్రిస్టియన్, ఇతర సోదరులు ఎంతో వేదనకు గురవుతున్నారు. అలాంటి వారిని తిరిగి మన దేశంలోకి తీసుకురావటం కోసం తెచ్చిన చట్టమే సీఏఏ."
-నడ్డా భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు
ఇదీ చూడండి:'ఆదాయ, నివాస ధ్రువపత్రాలు ఇకపై ఉచితం'