కర్ణాటకలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది యడియూరప్ప సర్కార్. పోలీసులు నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగా మాస్క్ లేకుండా కనిపించిన ఇద్దరు వ్యక్తులకు జరిమానా విధించారు. తమకు ఫైన్ వేశాడనే కోపంతో పోలీస్ బైక్‌ను దొంగిలించారు ఆ దుండగులు.
ఏం జరిగిందంటే?
హోసానగర్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపట్టారు అధికారులు. మాస్క్ లేకుండా ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను గమనించి.. వారికి జరిమానా విధించారు. తమ వద్ద డబ్బుల్లేవని బాధితులు చెప్పారు. దీంతో వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. అనంతరం వదిలేశారు.
స్టేషన్ నుంచి తిరిగి వెళ్లే క్రమంలో తమ బైక్ తాళం పోయిందని ఎదురుగా ఉన్న ఓ దుకాణంలోకి వెళ్లి డూప్లికేట్ కీ తయారు చేయించారు. ఆ తర్వాత హుందాగా బైక్ ఎత్తుకెళ్లారు.
విధులు పూర్తయ్యాక ఇంటికి వెళ్లేందుకు స్టేషన్ నుంచి బయటకు వచ్చిన పోలీస్‌కు తన బైక్ కనపడలేదు. దుండగులు దొంగిలించారని తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: 104 ఏళ్ల వయసులోనూ ఉచితంగా పాఠాలు బోధిస్తూ..