మీడియాకు స్వీయ నియంత్రణ ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 'సివిల్ సర్వీసు ఉద్యోగాల్లోకి ఓ వర్గం వారినే అధికంగా తీసుకునేందుకు కుట్ర జరిగింది' అని సుదర్శన్ టీవీ ఛానల్ ప్రోమోలు ప్రసారం చేయడంపై న్యాయస్థానం మండిపడింది. ఈ కార్యక్రమంపై దాఖలైన పిటిషన్ను విచారించింది. కొన్ని ఛానళ్లు నిర్వహిస్తోన్న డిబేట్లు ఆందోళన కలిగిస్తున్నాయని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
ఈ కార్యక్రమం ఎంతో వివక్షాపూరితంగా ఉంది. ఓ వర్గం మాత్రమే సివిల్ సర్వీసుల్లోకి అడుగుపెడుతుంది అని ప్రసారం చేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఎంత అవమానకరంగా ఉంది. ఎలాంటి వాస్తవిక ఆధారాలు లేకుండా మొత్తం యూపీఎస్సీ పరీక్షలనే కించపరిచేలా ఉంది.
- సుప్రీం ధర్మాసనం
'బిందాస్ బోల్' అనే ఈ కార్యక్రమం ప్రసారాన్ని రెండు రోజులపాటు నిలిపివేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సదరు కార్యక్రమం.. ఓ వర్గాన్ని దూషించేదిగా ఉందని ప్రాథమిక విచారణలో తేల్చినట్లు సుప్రీం స్పష్టంచేసింది. సెప్టెంబర్ 17న పిటిషన్పై మరోసారి విచారణ చేపడతామని పేర్కొంది.
న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు
పత్రికా, మీడియా స్వేచ్ఛ అన్నింటికన్నా ముఖ్యమని, అయితే ప్రజ్వాస్వామ్యంలో వాటిని నియంత్రించే సందర్భం రావడం అత్యంత దురదృష్టకరమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
సుదర్శన్ టీవీ తరఫున శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. సదరు కార్యక్రమంలో ప్రసారం చేసిన అంశాన్ని జాతీయ భద్రతకు సంబంధించిన పరిశోధనాత్మక కథనంగా సుదర్శన్ టీవీ చూసినట్లు కోర్టుకు విన్నవించారు. అయితే ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది.
"మీ కక్షిదారు ప్రసారం చేసిన కార్యక్రమం దేశానికి హాని చేసేదిగా ఉంది. భారత్.. విభిన్న సంస్కృతుల కలయిక అని సదరు ఛానల్ అంగీకరించడం లేదు. మీడియా స్వేచ్ఛను పరిగణించే అంశంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది."
- సుప్రీం ధర్మాసనం