ఓ సూపర్ మార్కెట్లో చోరీ జరిగింది. అయితే దొంగతనం చేసిన వ్యక్తి.. తనను క్షమించాలని వేడుకుంటూ ఓ లేఖ రాసి పెట్టాడు. తమిళనాడులోని మధురై జిల్లాలో జరిగిందీ సంఘటన.
ఏం జరిగిందంటే..?
మధురైలోని ఉసిలంపట్టి ప్రాంతంలో రామ్ ప్రకాశ్ అనే వ్యక్తి ఓ సూపర్ మార్కెట్‌ను నడుపుతున్నాడు. కొన్నిరోజుల క్రితం అతను రోజూలాగే ఉదయాన్నే షాపుకు వచ్చాడు. తలుపులు తెరిచి చూస్తే రూ.65,000 విలువగల కంప్యూటర్లు, ఒక టీవీ, రూ.5,000 నగదు మాయమయ్యాయి.
'నా మూడు నెలల ఆదాయం'
షాపులోనే రామ్ ప్రకాశ్‌కు ఓ కాగితం కనిపించింది. అది చదివి అవాక్కయ్యాడు ప్రకాశ్. చోరీ చేసినందుకు క్షమించమని వేడుకుంటూ దొంగ రాసిన ఉత్తరం అది.
" నన్ను క్షమించండి. నాకు చాలా ఆకలివేస్తుంది. నేను చేసిన ఈ దొంగతనం వల్ల మీరు మీ ఒక్కరోజు సంపాదన నష్టపోతారు. కానీ, అది నా మూణ్నెళ్ల ఆదాయానికి సమానం. మరొక్కసారి మీకు నా క్షమాపణలు "
-- ఉత్తరంలో దొంగ రాసిన మాటలు
ఈ విషయం గురించి పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశాడు రామ్ ప్రకాశ్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సూపర్ మార్కెట్లోని సీసీటీవీ దృశ్యాలు, వేలిముద్రల ద్వారా నిందితుడి కోసం గాలిస్తున్నారు.