ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: నిత్యావసరాలపై నిశిత దృష్టి

దేశంలో విధించిన లాక్​డౌన్​ కారణంగా ప్రజా రవాణా ఎక్కడికక్కడ పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా రెక్కాడితేగాని డొక్కాడని వారికి కష్టకాలం వచ్చి పడింది. మూడు వారాల లాక్‌డౌన్‌ కారణంగా వస్తు ఉత్పాదనలు, నిత్య జీవితావసరాల నిరంతర సరఫరా గొలుసు దెబ్బతినడం వల్ల భారతీయ సమాజంలో భిన్న వర్గాలవారు ఎదుర్కొంటున్న వేదనలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

The woes faced by different sections of the Indian community as a result of a three-week lockdown and the constant supply chain of daily life necessities are deplorable.
నిత్యావసరాలపై నిశిత దృష్టి
author img

By

Published : Apr 6, 2020, 7:33 AM IST

ఉరుకులు పరుగుల మానవాళి జీవన చక్ర భ్రమణానికి కరోనా మహమ్మారి ఒక్కసారిగా బ్రేకువేసింది. వందేళ్ల క్రితం నాటి స్పానిష్‌ ఫ్లూ తరహాలో విజృంభిస్తూ ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మందికిపైగా అభాగ్యులకు సోకి 65వేలమందిని కబళించిన కొవిడ్‌- భారత్‌లో 211 జిల్లాలకు విస్తరించింది. కొవిడ్‌ సృష్టించగల మానవ మహా విషాదం తాలూకు భయంతో ఇండియా సహా పలు దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించి కరోనా వ్యాప్తి నిరోధానికి తాపత్రయపడుతున్నాయి. జీవనోపాధి కంటే జీవితాలే ప్రధానమన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ పంథాలో సాగుతూ దేశార్థిక వ్యవస్థల్ని స్తంభింపజేశాయి. భారత్‌లాంటి దిగువ మధ్యాదాయ దేశాల్లో రెక్కాడితేగాని డొక్కాడని బడుగు జీవులదే మెజారిటీ. మూడు వారాల లాక్‌డౌన్‌ కారణంగా వస్తూత్పాదనలు, నిత్య జీవితావసరాల నిరంతర సరఫరా గొలుసు దెబ్బతినడంతో- భారతీయ సమాజంలో భిన్న వర్గాలవారు ఎదుర్కొంటున్న వేదనలు వర్ణనాతీతంగా ఉన్నాయి. దాదాపు 54 కోట్ల పశు సంతతితో పరిపుష్టమైన ఇండియాలో వాటి మేతకు, పాల విక్రయాలకూ ఎదురవుతున్న ప్రతిబంధకాలు- వాటిపై ఆధారపడిన 23శాతం చిన్న రైతుల జీవితాల్నీ ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. రోజూ 18 కోట్ల 80 లక్షల టన్నుల పాల ఉత్పత్తి జరుగుతున్నా వినియోగ స్థానాలకు వాటి సరఫరా సాధ్యంకాని పరిస్థితి- దేశార్థికాన్నీ ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తోంది.

కోళ్లు, మత్స్య పరిశ్రమలదీ అదే పరిస్థితి! పాలు, కూరగాయలు, ఆహార ధాన్యాలు, వంట నూనెలు, మందులు, వినియోగ వస్తువుల వంటి వాటికి కొద్ది రోజుల్లోనే కరవొచ్చే పరిస్థితి ఉందని దేశ రాజధాని దిల్లీ టోకు వర్తకుల సంఘం ముందస్తు హెచ్చరికలు చేస్తోంది. నిత్యావసరాల సరఫరాకు ఎలాంటి ఆంక్షలూ లేవని కేంద్రమే ప్రకటించింది. అయినా కూలీల కొరత, పరిమిత సంఖ్యలో రవాణా వాహనాలు ఒక ప్రతిబంధకమైతే, కర్ఫ్యూ పాసుల జారీలో జాప్యం మరో అవాంతరమై కిరాణా కొట్లలో సరకు నిండుకొనే పరిస్థితి దాపురిస్తోందని వర్తకుల సంఘం స్పష్టీకరించింది. చూడబోతే, దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలతోపాటు గ్రామ సీమలన్నింటి సమస్య అది. దాని సత్వర పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి!

ఆ రెండు రంగాలపై ప్రభావం...

ఇండియాలో రూ.15 లక్షల కోట్ల విలువైన రవాణా, లాజిస్టిక్స్‌ రంగం దేశార్థికానికి గుండెకాయలాంటిది. చిన్నాపెద్దా 53 లక్షల ట్రక్కులు, 7,400 గూడ్సు రైళ్లు, కార్గో విమానాలు అనునిత్యం వస్తూత్పాదనల రవాణా మహాయజ్ఞంలో చురుకుగా కదులుతుంటాయి. రోడ్డు రవాణాలో 60శాతం దాకా ఉత్పాదక రంగం వాటా కాగా, 10-15శాతం మౌలిక సదుపాయాలు, ఎగుమతి సంబంధమైనవి. గతనెల 24న లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆ రెండు రంగాలూ పూర్తిగా మూతపడటంతో- ట్రక్కులు ఎక్కడివి అక్కడే అన్నట్లుగా ఆగిపోయాయి. నిత్యావసరాలతోపాటు సాధారణ వస్తూత్పాదనల రవాణాకూ కేంద్రం పచ్చజెండా ఊపినా, ఆ కీలక రంగంలో అలముకొన్న స్తబ్ధత చెదరనే లేదు. కర్మాగారాలు, గిడ్డంగులు మూతపడి, ముడిసరకులు తుది ఉత్పాదనల రవాణా కొరవడి ట్రక్కులకు పనిలేకపోవడం, కరోనా భయంతో డ్రైవర్లూ ముందుకు రాకపోవడంతో సరఫరా గొలుసు తెగిపోయింది.

రానుపోనూ ఛార్జీ ఇస్తే తప్ప ఒకవైపు సరకు రవాణా సాగని పరిస్థితి- వస్తూత్పాదనల రేట్లకు రెక్కలు మొలిపిస్తోంది. కరవులో అధిక మోసంతో లాభాల పంట పండించుకోవాలనుకొనే అత్యాశాపరుల వర్గం ఉండనే ఉంది. కాయకష్టంతో పండించిన కాయగూరల్నీ విపణికి చేర్చేదారిలేక కళ్లాల్లోనే వదిలేస్తున్న బడుగు రైతుల గోడు గుండెల్ని మెలిపెడుతోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌నుంచి సోయాబీన్‌ దాణా నిలిచిపోవడం, అంతర్‌ జిల్లా రవాణా ఆగడంతో స్థానికంగా మొన్నజొన్న సరఫరాకు అడ్డంకులు ఏర్పడటంతో కోళ్ల పరిశ్రమ కుదేలవుతోంది. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో, హైవేల మీద అయిదు లక్షల ట్రక్కులు నిలిచిపోయాయంటున్నారు. అవి సక్రమంగా గమ్యస్థానాలకు చేరేలా చూడటం ద్వారా నిత్యావసరాల కొరతను అధిగమించడంతోపాటు, రబీ ఖరీఫ్‌ సంధికాలంలో రైతు ప్రయోజనాలు దెబ్బతినకుండా కాచుకోవడానికీ యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వాలు సిద్ధం కావాలి!

ఆంక్షల సడలింపుతో ఇబ్బందుల రాకుండా..

లాక్‌డౌన్‌ కాలంలో ఇండియా ప్రతి రోజు 800 కోట్ల డాలర్లు నష్టపోతోందన్నది ఒక అంచనా. మూడు వారాల వ్యవధిలో పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయల ఆర్థిక నష్టాల్ని, లక్షల సంఖ్యలో ఉద్యోగాల కోతను, రోజు కూలీల ఉపాధి వెతలతోపాటు నిత్యావసర సరఫరా అవస్థల్ని, వలస శ్రామికుల దురవస్థల్ని దేశం ప్రత్యక్షంగా పరికించింది. కరోనా మహమ్మారి ప్రజ్వలన కేంద్రాల(హాట్‌స్పాట్స్‌)ను భౌగోళికంగా గుర్తించి వాటినే గట్టిగా లాక్‌డౌన్‌ చెయ్యడం ద్వారా దేశార్థికాన్ని తెరిపిన పడేసే మలి అంచె వ్యూహాన్ని ప్రభుత్వాలు సిద్ధం చేస్తున్నాయి. తక్కిన చోట్ల అంచెలవారీగా లాక్‌డౌన్‌ను సడలించినా, నిత్యావసరాల రవాణా నిర్నిరోధంగా సాగేలా గట్టి కార్యాచరణ పట్టాలకెక్కాలి.

బ్యాంకులో రూ.40 లక్షల రుణం, క్షేత్రంలో 40 టన్నుల ద్రాక్ష ఉన్న రైతు ఎదుర్కొంటున్న దిక్కుతోచని స్థితి- దేశీయంగా నేడు ఉద్యాన పంటల రైతులందరిదీ! పంట నూర్పిళ్ల వేళ కూలీలు అందుబాటులో లేకపోవడంనుంచి, విక్రయం దాకా రబీ రైతులను వెంటాడుతున్న దిగుళ్లు చెప్పనలవి కాదు. శుద్ధి, ప్యాకింగ్‌ ఆగిపోవడంతో ఖరీఫ్‌ సీజన్‌లో విత్తన విక్రయాలు కష్టమని జాతీయ విత్తన సంస్థల సంఘం స్పష్టీకరిస్తోంది. చైనానుంచి మూల ఔషధాల దిగుమతి మరింత కాలం ఆగితే దేశీయంగా ఔషధాలకూ కొరత వచ్చే ప్రమాదం ఉంది. సరకు ఎగుమతి దిగుమతులపై అంతర్జాతీయంగా, అంతర్రాష్ట్రీయంగా ఉన్న ఆంక్షల్ని సడలించి పౌరుల నిత్య జీవనం ఏ విధంగానూ ఇబ్బందుల పాలు కాకుండా చూసుకోవాలి. కరోనా నిరోధానికి పటిష్ఠ చర్యలు, తగు జాగ్రత్తలూ అమలు చేస్తూనే దేశార్థికాన్ని గాడిన పెట్టాలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.