దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా ఘటనలో పంజాబ్ కోర్టు తీర్పు వెలువరించింది. జమ్ము కశ్మీర్‌లోని కథువాలో జరిగిన ఈ సంఘటనలో ఆరుగురు నిందితులను దోషులుగా తేలుస్తూ కోర్టు..... శిక్ష విధించింది. ఓ ఎనిమిదేళ్ల సంచార జాతి బాలికను అపహరించి, అత్యాచారం, హత్యకు పాల్పడ్డారని తేల్చింది కోర్టు.
కేసు సాగిందిలా...
⦁ 2018 జనవరి 10: జమ్ముకశ్మీర్ రసానా గ్రామంలో బకర్వాల్ గిరిజన తెగకు చెందిన ఓ ఎనిమిదేళ్ల బాలిక ఆచూకీ తెలియకుండాపోయింది.
⦁ 2018 జనవరి 12: బాలిక తప్పిపోయిందని కేసు నమోదు.
⦁ 2018 జనవరి 17: దొరికిన బాలిక మృతదేహం. శవపరీక్షలో అత్యాచారం, హత్యగా నిర్ధరణ.
⦁ 2018 జనవరి 22: జమ్ము కశ్మీర్ క్రైం బ్రాంచ్‌కు కేసు అప్పగింత.
⦁ 2018 ఫిబ్రవరి 16: హిందూ ఏక్తా మంచ్ ఆధ్వర్యంలో నిందితులకు అనుకూలంగా ర్యాలీ.
⦁ 2018 మార్చి 1: భాజపాకు చెందిన నాటి మంత్రులు చౌధురి లాల్ సింగ్, ప్రకాశ్ గంగా నేతృత్వంలో నిందితులకు అనుకూలంగా ర్యాలీ. అధికార కూటమిలో అభిప్రాయ భేదాలు.
⦁ 2018 ఏప్రిల్ 9: ఎనిమిది మంది అనుమానితుల్లో ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ కోర్టులో అభియోగపత్రం దాఖలు.
⦁ 2018 ఏప్రిల్ 10: తాను మైనర్‌నని చెప్పుకున్న 8వ వ్యక్తిపైనా అభియోగ పత్రం దాఖలు. ఛార్జిషీటు దాఖలు చేయకుండా అడ్డుకున్నందుకు న్యాయవాదులపై కేసు నమోదు చేసిన పోలీసులు.
⦁ 2018 ఏప్రిల్ 14: ర్యాలీలో పాల్గొన్న మంత్రుల రాజీనామా. అత్యంత పాశవిక ఘటనగా ఐరాస ప్రకటన.
⦁ 2018 ఏప్రిల్ 16: సెషన్స్ కోర్టులో విచారణ ప్రారంభం. అందరూ నిర్దోషులేనని వాదనలు.
⦁ 2018 మే 7: కథువా కోర్టు నుంచి పంజాబ్ పఠాన్‌కోట్ న్యాయస్థానానికి కేసు విచారణను బదిలీ చేస్తూ సుప్రీం నిర్ణయం. వేగంగా, రహస్యంగా విచారించాలని ఆదేశాలు.
⦁ 2019 జూన్ 3: ముగిసిన విచారణ. జూన్ 10న తీర్పును వెల్లడిస్తామన్న కోర్టు.
మరిన్ని వివరాలు...
⦁ గతేడాది జనవరి 10న బాలిక కిడ్నాపైంది. అతి కిరాతకంగా కొట్టి చంపేముందు నాలుగు రోజులపాటు బాలిక అత్యాచారానికి గురైంది. జనవరి 17న బాలిక నిర్జీవ దేహం అడవిలో దొరికింది. మూడు రోజుల అనంతరం ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
⦁ గ్రామ పెద్ద సాంజీరామ్, అతడి కుమారుడు విశాల్, మైనర్ బాలుడు, ఆనంద్ దత్తా, నిందితులకు సహకరించేందుకు ప్రయత్నించారన్న అభియోగంతో నలుగురు పోలీసులను అరెస్టు చేశారు.
⦁ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్ధరించారు. తమ పొలాల్లో గుర్రాలను మేపుతున్న సంచార జాతుల్లో భయం పుట్టించేందుకే ఈ దురాగాతానికి పాల్పడ్డారని విచారణలో తేల్చారు.
⦁ సెక్షన్ 120-బీ కింద నేరపూరిత కుట్ర, హత్య నేరంపై 302 సెక్షన్, సామూహిక అత్యాచారం ఆరోపణలపై 376-డీ కింద నిందితులపై ఛార్జీషీటు దాఖలు చేశారు. సాక్ష్యాలను రూపుమాపేందుకు ప్రయత్నించిన కారణంగా ఐపీసీ సెక్షన్ 328, లంచం తీసుకున్నారన్న అభియోగంతో సెక్షన్ 161 కింద పోలీసులపై కేసు నమోదు చేశారు.
⦁ న్యాయవాదులు జేకే చోప్రా, ఎస్ఎస్ బస్రా, హర్మీందర్ సింగ్ బాధిత బాలిక తరఫున వాదనలు వినిపించారు.
⦁ కోర్టు విచారణకు హాజరుకావడం లేదన్న కారణంతో న్యాయవాది దీపికా రజావత్‌ను గతేడాది బాలిక కుటుంబం తప్పించింది. తనకు బెదిరింపు ఫోన్లు రావడం కారణంగానే కేసు విచారణకు హాజరు కాలేదని రజావత్ ప్రకటించారు.
ఇదీ చూడండి: కథువా అత్యాచార కేసులో ఆరుగురు దోషులు