ETV Bharat / bharat

విద్యాలయాల్లో లైంగిక వేధింపుల విష సంస్కృతి - sexual harassment on students

విశ్వవిద్యాలయాల్లో కొందరు ఆచార్యుల తీరు కలవరపరుస్తోంది. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన స్థానంలో ఉంటూ.. విద్యార్థులు, పరిశోధకుల్ని ఏదో ఒక రూపంలో వేధిస్తున్న బాధాకర ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. ప్రత్యేకించి విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేస్తూ.. చివరికి జైలు పాలయ్యే దుస్థితిని కొనితెచ్చుకుంటున్న విష సంస్కృతి పెచ్చుమీరుతోంది.

the-toxic-culture-of-sexual-harassment-in-universities-is-growing-day-by-day
విద్యాలయాల్లో లైంగిక వేధింపుల విష సంస్కృతి
author img

By

Published : Feb 17, 2020, 7:01 AM IST

Updated : Mar 1, 2020, 2:12 PM IST

అత్యుత్తమ నైపుణ్యాలు, నైతిక విలువలు కలిగిన వృత్తి నిపుణుల్ని, పరిశోధకులను ప్రపంచానికి అందించాల్సిన విశ్వవిద్యాలయాల్లో కొందరు ఆచార్యుల తీరు కలవరపరుస్తోంది. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన స్థానంలో ఉంటూ.. విద్యార్థులు, పరిశోధకుల్ని ఏదో ఒక రూపంలో వేధిస్తున్న బాధాకర ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ప్రత్యేకించి విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేస్తూ, చివరికి జైలు పాలయ్యే దుస్థితినీ కొందరు కొనితెచ్చుకుంటున్నారు. గడచిన పది రోజుల వ్యవధిలో ఒక్క ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే ఏకంగా ముగ్గురు ఆచార్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇరువురు ఆచార్యులను నాలుగు రోజులపాటు రోజూ ఠాణాకు పిలిపించి ‘కౌన్సెలింగ్‌’ నిర్వహించి ఆఖరుకు ‘బైండోవర్‌’ చేసి, భవిష్యత్తులో మళ్లీ వేధింపులకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించి వదిలేయగా, మరో ఆచార్యుడిపై పశ్చిమ గోదావరి జిల్లాలో లైంగిక వేధింపుల కేసు కూడా నమోదు చేశారు. బాధిత మహిళలు వేధింపులు భరించలేక ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో ఫిర్యాదు చేయడంతో ముగ్గురి బండారం బయటపడింది.

నిత్యం ఎదుర్కొంటున్నవే..

ఇది కేవలం ఆంధ్ర విశ్వవిద్యాలయానికే పరిమితమైన సమస్య కాదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉన్న వర్సిటీల్లోనూ కొందరు యువతులు, పరిశోధకులు నిత్యం ఎదుర్కొంటున్నవే. కొందరు డబ్బుల కోసం వేధిస్తోంటే మరికొందరు లైంగిక అవసరాలను తీర్చుకోవడానికి వేధింపులకు పాల్పడుతున్నారు. ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఉండే వైద్య కళాశాలల్లోనూ కొందరు యువతులు తమ బాధలను పంటి బిగువున భరిస్తుండగా మరికొందరు ఆత్మహత్యలకూ ఒడిగడుతున్నారు.

వృత్తిపరమైన నైతిక నియమావళి..

విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఆచార్యుల ప్రవర్తన ఎలా ఉండాలన్న అంశంపై విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) 1988లోనే స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందుకోసం యూజీసీ ఒక కార్యదళాన్ని ఏర్పాటు చేసి అఖిల భారత విశ్వవిద్యాలయాలు, కళాశాలల ఆచార్యులు, అధ్యాపక సంఘాల సమాఖ్య ప్రతినిధులతో విస్తృత సమావేశాలు నిర్వహించిన అనంతరం వృత్తిపరమైన నైతిక నియమావళిని రూపొందించింది. విధుల్లోకి ప్రవేశించే ప్రతి ఆచార్యుడు, అధ్యాపకుడు ఆ నియమావళిని ఔపోసన పట్టాల్సి ఉండగా వాటిని పాటించాలన్న స్పృహే చాలామందిలో కొరవడుతోంది. కొందరికైతే అలాంటి నియమావళి ఉన్నట్లు కూడా తెలియడం లేదు. ఫలితంగా ఆచార్యులు ఎవరికి వారు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం పరిపాటిగా మారింది. సమాజ విశాల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన నైతిక నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి సంబంధించిన నిబంధనలు లేకపోవడంతో నియమావళి ఎందుకూ కొరగాకుండా పోతోంది. ఆదర్శనీయ స్థానంలో ఉండాల్సిన ఆచార్యులు వక్రమార్గంలో ప్రయాణిస్తే వారిపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తుండటంతో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు రాజకీయాలకు, వర్గ విభేదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి.

ఏం చేసినా చెల్లుతుందనేలా

విశ్వవిద్యాలయాల్లో ఉండే ఉపకులపతి(వీసీ), రిజిస్ట్రార్‌, రెక్టార్‌, డీన్‌, డైరెక్టర్లు వంటి పాలనపరమైన పదవులపై పలువురు ఆచార్యులకు మోజు పెరిగిపోతోంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆచార్యులు పార్టీల వారీగా విడిపోవడం విశ్వవిద్యాలయాల్లో పతనమవుతున్న విలువలకు నిదర్శనంగా నిలుస్తోంది. పరిశోధనలకు, ఆవిష్కరణలకు కేంద్రబిందువుల్లా ఉండాల్సిన వర్సిటీల్లో బోధన, పరిశోధన ప్రమాణాలు బలోపేతం కావాలంటే ముందుగా విద్యార్థులు స్వేచ్ఛగా అభిప్రాయాల్ని వెల్లడించి న్యాయం పొందే పరిస్థితి నెలకొనాలి. ఆచార్యులు తరగతులకు రాకపోయినా, పరిశోధనలకు ఏమాత్రం సహకరించకున్నా ప్రశ్నించే హక్కు పరిశోధక విద్యార్థులకు ఉండటం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారు తమ పీహెచ్‌డీ పట్టాపై ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఉంటోంది. పరిశోధకులకు మార్గదర్శిగా(గైడ్‌) కేటాయించే ఆచార్యులు ఎలాంటివారైనా విద్యార్థులు భరించాల్సి వస్తోంది. గైడ్‌ను మార్చుకోవాలన్నా, ప్రస్తుత గైడ్‌ అనుమతి అవసరం. ఇలాంటి నిబంధనలు అమలులో ఉండటం వల్ల తాము ఏం చేసినా చెల్లుతుందనేలా ఆచార్యులు ప్రవర్తిస్తున్న ఉదంతాలెన్నో గతంలో వెలుగు చూశాయి. కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల ఎంపిక ప్రక్రియ అడ్డగోలుగా జరగడంతో ఆయా నియామకాల్ని నిలిపివేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో ఉన్నతాధికారులకు ఉండే విచక్షణాధికారాల్ని గౌరవించి నియామక ప్రక్రియలను వారికే అప్పగిస్తుంటే ఆ ప్రక్రియను కూడా పలు విశ్వవిద్యాయాల ఉపకులపతులు భ్రష్టు పట్టించారు. విశ్వవిద్యాలయాలకు కులపతిగా ఉండే గవర్నర్‌కు పలువురు ఆచార్యులపై ఫిర్యాదులు భారీగా అందడం పరిపాటిగా మారింది. ఆయా ఫిర్యాదులను విచారించాలని గవర్నర్‌ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తున్నా విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులు ఖాతరు చేసే పరిస్థితి కానరావడం లేదు. ఏవేవో కారణాలు చూపి ఫిర్యాదులను గాలికొదిలేస్తుండటంతో తదుపరి చర్యలకూ అవకాశం ఉండటం లేదు.

కాలం చెల్లిన నిబంధనలే అసలు సమస్య

విశ్వవిద్యాలయాల్లో కొందరు ఆచార్యుల పైశాచిక ధోరణులకు అడ్డుకట్టవేసేలా ‘మహిళల ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలు’, ‘లైంగిక వేధింపులపై అంతర్గత ఫిర్యాదుల కమిటీ’లను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలు, కేంద్రాల పనితీరును సమీక్షించి, పర్యవేక్షించే వారూ కరవవడం వల్ల దశాబ్దాలుగా విశ్వవిద్యాలయాల పనితీరులో ఎలాంటి మార్పూ కానరాని దుస్థితి నెలకొంది. ఫలితంగా వర్సిటీల్లో ఆచార్యుల వికృత రూపాలు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తూ వ్యవస్థల్లోని లోపాల్ని ఎత్తిచూపుతున్నాయి. కాలం చెల్లిన నిబంధనల్లో మార్పులు తీసుకురాకపోవడమే అసలు సమస్య. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం మార్గదర్శకాలను కాలానుగుణంగా సంస్కరించడంతోపాటు- అవి కచ్చితంగా అమలయ్యే వాతావరణం కల్పించాలి.

- బి.ఎస్​ రామకృష్ణ

Last Updated : Mar 1, 2020, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.