ఉత్తరాఖండ్‌లోని హిమాలయ ధామం బద్రినాథ్ ఆలయం తెరుచుకుంది. ఈ తెల్లవారుజామున 4.30 గంటలకు అతి కొద్ది మంది ఆలయ బోర్డు సభ్యుల మధ్య ఆలయ ప్రధాన పూజారి రావల్ ఈశ్వరి ప్రసాద్ నంబూద్రి ఆలయ ద్వారాలను తెరిచారు.
ప్రధాని నరేంద్రమోదీ తరఫున ప్రజాశ్రేయస్సు కాంక్షిస్తూ తొలిపూజ నిర్వహించారు. ఈ పూజకు భక్తులు ఎవరూ హాజరు కాలేదు. అయినప్పటికీ ఆలయాన్ని 10 క్వింటాళ్ల పుష్పాలతో అలంకరించారు. విద్యుత్ దీపాల వెలుగులో బద్రినాథ్ ఆలయం దేదీప్యమైంది. ఈ క్రతువులో పాల్గొన్న వారందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించారు. ఆలయం తెరుచుకోవడం పట్ల భక్తులకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా అంతమొంది త్వరలోనే చార్‌ధామ్ యాత్ర ప్రారంభం అవుతుందని ఆయన ఆకాంక్షించారు
ఉత్తరాఖండ్‌లోని నాలుగు పుణ్యక్షేత్రాలు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. భక్తులు ఛార్‌దామ్ యాత్రలో భాగంగా ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
ఇదీ చూడండి: కరోనా కష్టాలు: ఆతిథ్యమిచ్చే వారికే 'ఆసరా' కరవాయే!