సుదీర్ఘ రాజకీయ, పరిపాలనా అనుభవంతో పతనావస్థలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానిగా పీవీ నరసింహారావు ఊపిరిలూదారు. బలమైన ఆర్థిక వ్యవస్థగా దేశం రూపుదిద్దుకోవడానికి ఆయన ఆవిష్కరించిన సంస్కరణలే మూలం. భాజపా రాజకీయంగా పీవీ నరహింహారావును వ్యతిరేకించింది. కానీ ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను తిరస్కరించలేకపోయింది.
ప్రధానిగా పీవీ బాధ్యతలు తీసుకునే నాటికి.. కనీస వారం రోజులకు సరిపడా చేసుకున్న దిగుమతులకు చెల్లింపులు చేయలేని దయనీయస్థితిలో దేశం ఉంది. అప్పటివరకు అనుసరించిన సంక్లిష్ట విధానాలకు స్వస్తి చెప్పిన ఆయన.. దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల వ్యవధిలోనే మన్మోహన్సింగ్ను ఆర్థికమంత్రిగా తీసుకోవడం పీవీ సాహసోపేత నిర్ణయం. క్షేత్రస్థాయి మూలాలతో బలీయమైన అనుబంధం కారణంగా దేశ చరిత్రలో తొలిసారి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు బడ్జెట్లో పీవీ పెద్దపీట వేశారు. డ్వాక్రా పథకం పీవీ హయాంలోనే పురుడు పోసుకుందన్న విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు.
నెహ్రూ సామ్యవాద ఆర్థిక సిద్ధాంతాలకు పూర్తి మద్దతుదారుడైనప్పటికీ దేశ పరిస్థితుల దృష్ట్యా సరళీకృత విధానాన్ని అందిపుచ్చుకోవడంలో ఆశించిన ఫలితాన్ని రాబట్టగలిగారు పీవీ. ప్రపంచ యువనికపై భారతదేశాన్ని బలమైన శక్తిగా నిలిపిన ఆయన చిరస్మరణీయుడు.
ప్రధానిగా 1991లో పీవీ తెచ్చిన సంస్కరణలను ఇప్పటికీ ఎవరూ ప్రశ్నించలేరు. కాంగ్రెస్ ఆయన్ని అగౌరపరచింది. అసలు ఆయన కాంగ్రెస్ సభ్యుడే కాదన్నట్టు ప్రవర్తించింది. పీవీ చివరి రోజుల్లో, అయన మరణించప్పుడు కూడా కాంగ్రెస్ అవమానపరిచింది. కానీ దేశంలో పీవీ తెచ్చిన ఆర్థిక మార్పులను మాత్రం తిరస్కరించలేకపోయింది.
దేశంలోని ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి పీవీ ఎంచుకున్న మన్మోహన్ సింగే.. కాంగ్రెస్ తరఫున ఆయన తర్వాత ప్రధాని బాధ్యతలు చేపట్టడం విశేషం.
-- పరకాల ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు.