భారత నేవీ ఆదివారం రోజు మరో మైలురాయిని చేరుకుంది. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ లైట్ కంబాట్ యుద్ధ విమానం సముద్ర యుద్ధ నౌక విక్రమాదిత్య మీది నుంచి విజయవంతంగా టేకాఫ్ అయ్యింది. ఈ మేరకు నేవీ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.
‘దేశీయ యుద్ధ విమానం తేజస్ ఎల్‌సీఏ విక్రమాదిత్య మీది నుంచి విజయవంతంగా టేకాఫ్ అయింది. యుద్ధ విమానం టేకాఫ్ చేసుకోవడానికి వీలుగా వాహకనౌకపై వంపుతో నిర్మించిన ర్యాంప్ సహకరించింది. ఈ ప్రయోగంతో భారత నేవీ మరో కీలక సాహసాన్ని పూర్తి చేసినట్లయింది’ అని తెలిపారు.
ఇప్పటికే నేవీ... శనివారం ఈ తేజస్ విమాన ల్యాండింగ్ ప్రక్రియను సైతం విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విమానంతో వాహకనౌకపై నుంచి ఎగిరే సామర్థ్యం గల ఎంపిక చేసిన దేశాల సరసన భారత్ చేరింది. తేజస్ విమానాన్ని డీఆర్‌డీఓ.. పలు విమాన తయారీ సంస్థలతో కలిసి రూపొందించింది. ఆదివారం చేసిన ప్రయోగాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. భారత యుద్ధ రంగ విమాన చరిత్రలో ఇదో గొప్ప కార్యక్రమంగా అభివర్ణించారు.
ఇదీ చూడండి: ఉగ్రవాదులతో వెళ్తూ చిక్కిన సీనియర్ పోలీస్ అధికారి