వాస్తవాధీన రేఖ నుంచి నియంత్రణ రేఖ వరకు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆడుగుజాడల్లోనే దేశం నడుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆయన ఇప్పుడు ఉండి ఉంటే.. భారత్‌ను చూసి గర్వపడేవారని పేర్కొన్నారు.
కోల్‌కతాలో నేతాజీ 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని. ఇతర దేశాలకు వ్యాక్సిన్లు అందించే స్థాయికి భారత్ చేరిందన్నారు మోదీ. నేతాజీ ఇలాంటి భారత్ కోసమే కలలు కన్నారని వెల్లడించారు.
"సమర్థంగా తయారవుతోన్న భారత్ ఎదుగుదలను చూస్తే నేతాజీ ఏమనుకునేవారో అని ఆలోచిస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేతాజీ ఇలాంటి భారత్ కోసమే కలలు కన్నారు. విపత్కర పరిస్థితులు ఎప్పుడు ఎదురైనా దేశం దాన్ని ధైర్యంగా ఎదుర్కుంటోంది. ప్రత్యర్థి దేశాల వక్ర బుద్ధికి దీటైన సమాధానం ఇస్తోంది."
----నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ప్రస్తుతం దేశంలో తేజస్, రఫేల్ వంటి అధునాతన యుద్ధ విమానాలున్నాయని గుర్తుచేశారు మోదీ. సైనిక శక్తిలోనూ భారత్ తీసిపోదని అభివర్ణించారు.
ఈ సందర్భంగా బంగాల్ చరిత్రపై ప్రశంసల వర్షం కురిపించారు మోదీ. బంగాల్ పుణ్యభూమిలో మహామహా వ్యక్తులు జన్మించారని తెలిపారు. ఎందరో మహానుభావులతో పాటు గొప్ప విజ్ఞానానికి కూడా కోల్‌కతా పుట్టినిల్లు అని వెల్లడించారు. జాతీయగీతం, జాతీయం గేయం కూడా ఈ పుణ్యభూమి నుంచే పుట్టాయని గుర్తుచేశారు.
వేడుకల్లో భాగంగా.. నేతాజీ లేఖలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు మోదీ. నేతాజీ స్మరణలో పోస్టల్ స్టాంప్‌ను కూడా విడుదల చేశారు.
ఈ వేడుకలో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు గవర్నర్ ధన్కర్ కూడా పాల్గొన్నారు.
అంతకుముందు కోల్‌కతాకు చేరిన వెంటనే నేతాజీ భవన్, నేషనల్ లైబ్రరీలను సందర్శించారు మోదీ.
ఇదీ చూడండి:- 'సవాళ్లు ఎదురవుతాయని నేతాజీ ఊహించారు'